Global Vaartha
Date of Publish : 27/10/2026, 1:57 pm
Editor : భవ్య జర్నలిస్ట్

జగన్.. జనజీవన స్రవంతిలోకి రావాలి: సీఎం చంద్రబాబు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. జనజీవన స్రవంతిలోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ‘జనజీవన స్రవంతిలోకి రమ్మని గతంలో నక్సలైట్లకు చెప్పాను. వచ్చినవాళ్లు బాగుపడ్డారు. రాని వాళ్లు ఏమయ్యారో మీకు తెలుసు కదా’ అని వ్యాఖ్యానించారు. జగన్ కూడా ఇలానే జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు. ఈరోజు (మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ సహనాన్ని, సంయమనాన్ని కూడా గొడ్డలి పార్టీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. వాళ్ల కుటుంబంలోనూ సంక్షోభాన్ని సృష్టించుకున్నారని విమర్శించారు. ఆస్తుల కోసం సొంత చెల్లెల్ని, తల్లిని మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘జగన్ ఆలోచన ప్యాలస్ కోసం.. మా ఆలోచన, తపన.. ప్రజలు. పేదల కోసం’ అని చెప్పుకొచ్చారు. నేరాలు, ఘోరాలు చేసే పార్టీ సృష్టించే అడ్డంకులను సమర్థంగా దాటుకుని ముందుకెళ్తామన్నారు.సార్వత్రిక ఎన్నికల్లో కూడా చేయనంత కసరత్తు ఈ స్థానిక ఎన్నికల్లో చేశామని సీఎం తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై గతంలో వివిధ సందర్భాల్లో కసరత్తు చేశామని... కానీ ఈసారి స్థానిక ఎన్నికల్లో చాలా కసరత్తే చేశామని వెల్లడించారు. ఎంపీటీసీల స్థాయిలో సీట్ల సర్దుబాటు.. అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించామన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమిగా పని చేయడానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారుగా ముందుకెళుతున్నామన్నారు. ఇక స్థానిక సంస్థల్లోనూ కూటమి గెలుపు ద్వారా ట్రిపుల్ ఇంజిన్ స్పీడ్‌తో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి మద్దతు పలికి ట్రెండ్ సెట్ చేయాలని ప్రజలను కోరారు. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో సీట్లు ఇవ్వలేని వాళ్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించేందుకు మూడు పార్టీల కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save