Global Vaartha
Date of Publish : 27/10/2026, 3:27 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఆర్నబ్ తుఫాన్ పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగునీరు సిద్ధం చేయండి: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఆదేశించారు. ఆర్నబ్ తుఫాన్ ప్రభావంపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఈరోజు (మంగళవారం) సమీక్షా సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. అలాగే, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని వివిధ జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. వివిధ జిల్లాల్లో ఆర్నబ్ తుఫాన్ చూపనున్న ప్రభావం, భారీ వర్షాల పరిస్థితి పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ప్రస్తుత పరిస్థితి, ముందస్తు సన్నద్ధతా చర్యలపై పలు సూచనలు చేశారు. ప్రస్తుతం కాకినాడ సమీపంలోని యానాంకు 167 కిలోమీటర్ల దూరంలో ఆర్నబ్ తుఫాన్ కేంద్రీకృతమైందని అధికారులు తెలిపారు.గడచిన ఆరు గంటలుగా తీరంవైపుగా 23 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోందని అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తుఫాన్ పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగునీరు వంటివి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తుఫాన్ ప్రభావం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వివిధ జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశించారు.విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వీలైనంత త్వరితగతిన పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈదురు గాలుల కారణంగా పడిపోయిన చెట్లు, హోర్డింగులతో రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని మార్గనిర్దేశం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save