Global Vaartha
Date of Publish : 27/10/2026, 8:47 pm
Editor : భవ్య జర్నలిస్ట్

రాజీవ్‌ ప్రధాని కావడాన్ని వ్యతిరేకించా... సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు!

 కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన జీవిత విశేషాలను పుస్తక రూపంలో తీసుకురానున్నారు. 

ఇప్పటి వరకు తనపై ఎన్నో రకాల కల్పిత కథనాలు, అతిశయోక్తులు ప్రచారంలోకి వచ్చాయని, అందుకే తన కథను వాస్తవాలతో ప్రపంచం ముందుంచేందుకు 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పేరుతో ఆత్మకథ రాసినట్లు ఆమె వెల్లడించారు. నవంబర్ 10న ఈ పుస్తకం పాఠకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.సోనియా గాంధీ మాట్లాడుతూ.. 'నాపై చాలా మంది చాలా రకాలుగా రాశారు. వాటిలో చాలా వరకు సత్యదూరమైనవి లేదా కల్పితమే. అందుకే నా కథను, వాస్తవాలను నా కోణంలో చెప్పాలనిపించింది. ఈ పుస్తకం వస్తే కొందరి అభిప్రాయాలు మారవచ్చు. మరికొందరిలో వ్యతిరేకత రావచ్చు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ సహజమే' అని సోనియా గాంధీ పేర్కొన్నారు.

ఈ పుస్తకంలో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించినట్లు సోనియా గాంధీ తెలిపారు. 1965లో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఓ చిన్న గ్రీకు రెస్టారెంట్‌లో రాజీవ్ గాంధీతో తన ప్రేమ ఎలా ప్రారంభమైందనే మధురమైన జ్ఞాపకాలను కూడా ఈ సందర్భంగా ఆమె గుర్తుచేసుకున్నారు. తొలి పరిచయంతోనే రాజీవ్‌తో ప్రేమలో పడ్డానని, ఆ తర్వాత ఇద్దరి మనసులు కలిశాయని తెలిపారు. తామిద్దరం అందమైన జ్ఞాపకాలతో నిండిన ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నామని, నవంబర్ 10న, ఆ ప్రపంచాన్ని మీతో పంచుకుంటున్నానని సోనియా గాంధీ అన్నారు. అంతర్జాతీయ ప్రచురణ సంస్థ 'ఆల్ఫ్రెడ్ ఎ నాఫ్' (Alfred A Knopf) ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువస్తుండగా, భారతదేశంలో 'హార్పర్ ‌కాలిన్స్ ఇండియా' సంస్థ దీనిని విడుదల చేయనుంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save