Global Vaartha
Date of Publish : 27/10/2026, 8:49 pm
Editor : భవ్య జర్నలిస్ట్

భవనంపై నుంచి దూకి శాస్త్రవేత్త ఆత్మహత్య!

బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్త శరద్ కతియార్ బలవన్మరణానికి పాల్పడట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 21న ఈ ఘటన చోటుచేసుకుంది. డీఆర్‌డీఓకు చెందిన ఎయిరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో (ఏడీఏ) శరద్ కతియార్ శాస్త్రవేత్తగా పనిచేసేవారు. సీగెహళ్లిలోని ఓ భవనంలో నాలుగో అంతస్తులో కుటుంబంతో కలిసి ఉండేవారు. లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ మాక్2 ప్రోగ్రామ్‌‌లో కూడా ఆయన పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది.జాతీయ మీడియా కథనాల ప్రకారం, మానసిక, ప్రవర్తన మార్పులకు సంబంధించి ఇబ్బంది పడుతున్న శరద్ కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారు. అక్టోబర్ 21 ఉదయం బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్‌లో చికిత్స కోసం కుటుంబంతో పాటు వెళ్లి తిరిగొచ్చారు. ఆ రాత్రి 7.30 - 8.00 గంటల మధ్య భవనంపై నుంచి కిందకుదూకేశారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన ఆయనను కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబసభ్యుల ఆరోపణల కోణంలో కూడా విచారణ చేపట్టారు.
శరద్ కుటుంబసభ్యులు పేర్కొన్న విషయాలపై ఏడీఏ అడ్మినిస్ట్రేషన్, హ్యూమన్ రిసోర్స్ విభాగం డైరెక్టర్ స్పందించారు. ‘అలాంటి అంశాలేవీ తమ దృష్టికి రాలేదు. ఆయన సహోద్యోగులతో కూడా మాట్లాడాము. తమకూ అలాంటివి ఏమీ తెలియవని వారు చెప్పారు’ అని డైరెక్టర్ తెలిపారు. ఒత్తిడిని ఎదుర్కొనే విషయమై ఇప్పటికే తమ సంస్థలో పలు కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save