అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలు విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి సూచించారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు దెబ్బతినే అవకాశం ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన ప్రాంతాల్లో వెంటనే స్పందించి, సాధ్యమైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని పుల్లారెడ్డి స్పష్టం చేశారు.
ప్రజలు పాటించాల్సిన విద్యుత్ భద్రతా సూచనలు:
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలి.
తెగిపడిన విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు. వాటికి దూరంగా ఉండాలి.
నీరు నిలిచిన ప్రాంతాల్లో విద్యుత్ పరికరాలు, స్తంభాల సమీపానికి వెళ్లకూడదు.
ఒరిగిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలు, ఇతర విద్యుత్ ప్రమాదాలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలి.
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే అత్యవసర సహాయం కోసం APCPDCL టోల్‌ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలి.
జిల్లాల వారీగా APCPDCL కంట్రోల్ రూమ్ నంబర్లు:
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎండీ అధికారులకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సకాలంలో సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు విద్యుత్ భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ, తుఫాన్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీసీపీడీసీఎల్ విజ్ఞప్తి చేసింది.