Global Vaartha
Date of Publish : 28/10/2026, 10:41 am
Editor : భవ్య జర్నలిస్ట్

హౌతీలతో కాల్పుల విరమణకు సౌదీ అరేబియా $1 బిలియన్ ఆఫర్ చేసిందా?

సౌదీ అరేబియా భూభాగం, ఆయిల్ మౌలిక వసతులపై యెమెన్‌కు చెందిన హౌతీ బలగాల దాడులను అరికట్టడానికి, ఇరాన్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కోసం సౌదీ అరేబియా హౌతీలకు 1 బిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.8,300 కోట్లు) ఆఫర్ చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఉద్రిక్తతలు తగ్గించేందుకు సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ టెహ్రాన్‌కు వెళ్లి ఇరాన్ అధ్యక్షుడితోపాటు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ మీడియా కథనం ప్రకారం, రక్షణ మంత్రి తాను వచ్చిన సైనిక విమానంలోనే ఈ $1 బిలియన్ నిధులను టెహ్రాన్‌కు తీసుకొచ్చారని సమాచారం. అయితే సౌదీ అధికారులు ఈ నగదు రవాణా వార్తలను ధ్రువీకరించలేదు.

ఈ దౌత్య చర్చల్లో టర్కీ నిఘా విభాగం అధిపతి ఇబ్రహీం కాలిన్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ (IRGC) సీనియర్ అధికారులు పాల్గొన్నారని నివేదిక వెల్లడించింది. ఇటీవల సౌదీ విమానాశ్రయాలు, చమురు కేంద్రాలపై హౌతీల క్షిపణి/డ్రోన్ దాడులు పెరగడం, అలాగే హార్ముజ్ జలసంధిలో ట్యాంకర్లపై ఇరాన్ దాడులతో సౌదీ తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. మూడేళ్ల క్రితం కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం హౌతీ పాలనలోని ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, సివిల్ మౌలిక వసతుల పునర్నిర్మాణానికి సౌదీ ఆర్థిక సహాయం అందించాల్సి ఉంది. సౌదీ దీనికి వెనుకాడటంతోనే తాము మళ్లీ దాడులు ప్రారంభించామని హౌతీలు చెబుతున్నారు.

ఉద్రిక్తతలు తగ్గించడం, ఖతార్, పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వ యత్నాలకు మద్దతు ఇవ్వడంలో భాగంగానే 'మెక్కా జాయింట్ డిఫెన్స్ అలయన్స్' ప్రతినిధులతో కలిసి రక్షణ మంత్రి టెహ్రాన్ వెళ్లారని సౌదీ స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే, 'సైనిక బ్లాక్‌మెయిల్' ద్వారా రుద్దే ఎలాంటి సీజ్‌ఫైర్‌ను అంగీకరించబోమని సౌదీ పేర్కొంది. యెమెన్ అధికారిక ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకున్న భూభాగాలను హౌతీలు తిరగి ఇచ్చేంత వరకు ఎలాంటి నిధులు బదిలీ చేయబోమని స్పష్టం చేసింది.(Saudi Houthi Ceasefire Deal)

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save