Global Vaartha
Date of Publish : 28/10/2026, 10:53 am
Editor : భవ్య జర్నలిస్ట్

తప్పు చేస్తున్నామని తెలుసు.. మాకు వేరే దారి లేదు

 ‘‘ఇద్దరమూ కలిసి చాలా కాలం క్రితం నిర్ణయం తీసుకున్నాం. దీనిలో మూడో వ్యక్తి ప్రమేయం లేదు. స్నేహితులను, చుట్టుపక్కల వారిని వివరాలు అడగొద్దు. మేం తప్పు చేస్తున్నాం అని తెలుసు. కానీ మాకు వేరే దారి లేదు’’ అని ఇంటి గోడలపై సూసైడ్‌ నోట్‌ రాసిన దంపతులు రెండేళ్ల చిన్నారిని చంపి తాము ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌హెచ్‌ఓ విజయ్‌కుమార్‌, మృతుడి సోదరుడు జగన్నాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌, బంకురా జిల్లా, రాధామనోహర్‌ పూర్‌కు చెందిన గోపీనాథ్‌ (32), సమత(26)లకు ఐదేళ్ల క్రితం వివాహమైంది.గోపీనాథ్‌ గచ్చిబౌలిలోని మాస్టర్‌ పీస్‌ బఫట్‌ రెస్టారెంట్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. వీరికి రెండేళ్ల వయస్సు ఉన్న కుమార్తె స్నిగ్ద ఉంది. మూడేళ్ల నుంచి కేపీహెచ్‌బీ కాలనీ రమ్యాగ్రౌండ్‌ వద్ద అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. మంగళవారం రెస్టారెంట్‌కు డ్యూటీకి రాలేదు. ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో సహోద్యోగి మంగళవారం సాయంత్రం ఇంటికి రాగా తలుపులు వేసి ఉన్నాయి. ఎంత కొట్టినా తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టిచూడగా ముగ్గురు మృతి చెంది ఉన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే గోపినాథ్‌, సమత తమ చిన్నారి కుమార్తెతో కలిసి మృతి చెందడం కలకలం రేపింది. చిన్నారి మంచంపై చనిపోయి ఉంది.ఆమె ఒంటిపై గాయాలు లేకపోవడంతో స్నిగ్ద ఊపిరి ఆడకుండా హత్యచేసి దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా మంగళవారం తెల్లవారుజామున సుమారు 4గంటల సమయంలో స్థానికులు నీటి కుళాయి వస్తుందని తలుపులు తట్టగా తలుపులు తీయలేదు. దీంతో వారు సోమవారం రాత్రే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారికి ఎటువంటి సమస్యలూ లేవని, ఆత్యహత్యకు ఎందుకు పాల్పడి ఉంటారనేది తెలియటం లేదని బంధువులు అంటుండగా కొందరు మాత్రం వీరికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పేర్కొంటున్నారు. మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం తరలించిన పోలీసులు మృతుడి సోదరుడు జగన్నాథ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save