Global Vaartha
Date of Publish : 16/10/2026, 7:39 pm
Editor : భవ్య జర్నలిస్ట్

‘వారణాసి’లో కుంభ పాత్రపై ఆసక్తికర అప్‌డేట్.. పృథ్వీరాజ్‌కు మహేశ్‌, రాజమౌళి బర్త్‌డే విషెస్

  • ‘ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన మేధస్సు’ అంటూ కుంభ పాత్రపై మేకర్స్ ఆసక్తికర వ్యాఖ్య
  • పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వర్కింగ్ స్టిల్ విడుదల
  • మలయాళ స్టార్‌కు శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ బాబు, ఎస్‌.ఎస్‌. రాజమౌళి
  • 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ‘వారణాసి’

సూపర్‌స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ నుంచి ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడు ‘కుంభ’ పాత్రలో నటిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ అక్టోబర్ 16న పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ, రాజమౌళి–పృథ్వీరాజ్ సెట్స్‌లో చర్చించుకుంటున్న వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేసింది. ‘వారణాసి ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన మేధస్సు కలిగిన వ్యక్తి.. హ్యాపీ బర్త్‌డే కుంభ’ అంటూ చేసిన పోస్ట్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

హీరో మహేశ్ బాబు కూడా సోషల్ మీడియా వేదికగా పృథ్వీరాజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ప్రేమ, సంతోషం ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ఆకాంక్షించారు. దర్శకుడు రాజమౌళి తనదైన శైలిలో స్పందిస్తూ, పృథ్వీరాజ్‌లోని ‘కుంభ’ను ఈ రోజే మేల్కొలపాలని తాను అనుకోవడం లేదని, ప్రపంచంపై తనదైన ముద్ర వేయాలని విధి నిర్ణయించిన వ్యక్తి కుంభ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో సినిమాలో ప్రతినాయకుడి పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉండబోతోందనే అంచనాలు మరింత పెరిగాయి.

భారీ అంచనాలతో రూపొందుతున్న ‘వారణాసి’లో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సాగే యాక్షన్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తాజా అప్‌డేట్‌తో ‘వారణాసి’లో కుంభ పాత్ర ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save