Global Vaartha
Date of Publish : 28/10/2026, 1:16 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఆర్నబ్ తుఫాన్ నష్టంపై కేంద్ర బృందాలను పంపండి.. అమిత్ షాకు చంద్రబాబు లేఖ

 ఏపీపై ఆర్నబ్ తుఫాన్ ప్రభావంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తఫాన్ తీవ్రత కారణంగా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్టు లేఖలో పేర్కొన్నారు. త్వరితగతిన తుఫాన్ నష్టంపై అంచనాకు కేంద్ర బృందాలను పంపాలని కోరారు. తుఫాన్ సహాయక చర్యల్లో 14 జిల్లాల్లో 16 ఎన్డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను నియమించినట్టు స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో 28 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల కారణంగా ఇప్పటివరకు ప్రాణనష్టం నమోదు కాలేదని సీఎం తెలిపారు.ప్రాథమిక అంచనా ప్రకారం 180 ఇళ్లు దెబ్బతిన్నాయని, రహదారులపై 220కి పైగా చెట్లు కూలిపోయాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. తీర ప్రాంతాల్లో చాలా చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయని.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్టు చెప్పారు. భారీ వర్షాల కారణంగా ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట నీట మునిగినట్టు తెలిపారు. ఇప్పటి వరకూ 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని తెలియజేశారు. కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుఫాన్ ప్రభావం అధికంగా ఉందని స్పష్టం చేశారు.

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా కంట్రోల్ రూమ్‌లు, రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్‌ కేంద్రం నిరంతరం పనిచేస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు సహాయ చర్యలు, విద్యుత్‌, తాగునీటి పునరుద్ధరణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. తుఫాన్ సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఇతర కేంద్ర సంస్థల సహకారం కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నష్టాన్ని అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాన్ని పంపాలని కేంద్ర మంత్రి అమిత్‌షాను లేఖలో కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు నిరంతర సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save