Global Vaartha
Date of Publish : 28/10/2026, 1:25 pm
Editor : భవ్య జర్నలిస్ట్

‘జగన్‌ది వీధి రౌడీ భాష’.. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శలు

పులివెందులలో మాజీ సీఎం జగన్ మాట్లాడిన భాష ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని... ఒక వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్‌లో అహంకారం, విధ్వంసకర ధోరణి మారలేదని విమర్శించారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే ‘జగన్ 2.0’ అంటూ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. సొంత ఇలాకా పులివెందుల స్థానిక ఎన్నికల్లోనూ వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ఏకగ్రీవాలు అయితే టికెట్ ఇవ్వనన్న జగన్.. పులివెందులలో క్లీన్‌స్వీప్ అయితే తన సీటుపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నమోదు చేస్తున్న విజయాలే 2029 సార్వత్రిక ఎన్నికలకు బలమైన పునాదని ఎమ్మెల్యే తెలిపారు. అక్రమాస్తులు, భూ కుంభకోణాలు, లిక్కర్ కేసుల విచారణ భయంతోనే బజార్లోకి రమ్మంటూ కార్యకర్తలను జగన్ రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. ఓటమిని విశ్లేషించుకోకుండా ప్రజలపైనే తప్పు నెడుతూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. తల్లిని, చెల్లిని రోడ్డుపైకి తెచ్చి, మేనకోడలి పెళ్లిని అడ్డుకున్న వ్యక్తి మహిళా సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, ఎన్నికల అధికారులను బెదిరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పార్టీకి భవిష్యత్తు లేదన్న తీవ్ర అభద్రతా భావంతోనే జగన్ అసహన ప్రసంగాలు చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నాయకత్వంలో అమరావతి నిర్మాణం, పరిశ్రమలతో రాష్ట్రం పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save