Global Vaartha
Date of Publish : 28/10/2026, 1:35 pm
Editor : భవ్య జర్నలిస్ట్

మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు..!

* కడపలో డిస్ట్రిబ్యూషన్, స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

కడప, అక్టోబరు 28: కడప నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

బుధవారం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, తదితర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కడప ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, స్ట్రాంగ్ రూములను అలాగే మౌలానా ఆజాద్ ఉర్దూ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, విద్యుత్ సౌకర్యం, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో మౌలిక వసతులు, అధికారుల రాకపోకలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, ఏజెంట్లకు అవసరమైన సౌకర్యాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఎన్నికల నిర్వహణలో ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమైన దశ అని, ఈ ప్రక్రియలో ప్రతి అంశాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా, పూర్తి అప్రమత్తతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. భద్రతా చర్యల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, ఎన్నికల సామగ్రి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో మురళి, కడప నగరపాలక సంస్థ కమిషనర్ డా. పి. భవానీ ప్రసాద్, డీఎస్పీ టి. భవానీ సంబంధిత ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

--------///---------

స.పౌ.సం. శాఖ, వైఎస్సార్ కడప జిల్లా.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save