Global Vaartha
Date of Publish : 16/10/2026, 7:41 pm
Editor : భవ్య జర్నలిస్ట్

హోటల్ గదిలో కలవాలని ఒత్తిడి.. సినిమా ఛాన్స్‌ కోల్పోయా: విద్యా బాలన్

  • కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్న బాలీవుడ్ నటి
  • హోటల్ గదిలోనే మాట్లాడాలంటూ దర్శకుడు పట్టుబట్టాడని వెల్లడి
  • అతడి ప్రవర్తనపై అనుమానంతో తలుపు తెరిచి ఉంచినట్లు వివరణ
  • ఆ ఘటన తర్వాత సినిమా అవకాశం చేజారిందన్న విద్యా బాలన్

బాలీవుడ్ నటి విద్యా బాలన్ తన సినీ ప్రయాణం తొలినాళ్లలో ఎదుర్కొన్న ఓ అనుభవం మరోసారి చర్చకు వచ్చింది. ఓ సినిమా కోసం దర్శకుడిని కలిసిన సమయంలో అతడి ప్రవర్తన తనను ఇబ్బందికి గురిచేసిందని ఆమె గతంలో వెల్లడించారు. చెన్నైలో యాడ్‌ ఫిల్మ్‌ షూటింగ్‌ కోసం వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని, అప్పటికే ఓ చిత్రానికి అంగీకరించినందున దర్శకుడితో సమావేశం కావాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు.

తాను కాఫీ షాప్‌లో మాట్లాడుకుందామని సూచించినప్పటికీ, దర్శకుడు మాత్రం హోటల్ గదిలోనే కలవాలని పదేపదే కోరినట్లు విద్యా బాలన్ తెలిపారు. అతడి ఉద్దేశంపై సందేహం కలగడంతో అప్రమత్తంగా వ్యవహరించానని చెప్పారు. గదిలోకి వెళ్లిన తర్వాత తలుపును మూసివేయకుండా తెరిచి ఉంచానని, దీంతో కొద్దిసేపటికే దర్శకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడని వివరించారు. ఆ తర్వాత తనను ఆ సినిమా నుంచి తప్పించారని ఆమె పేర్కొన్నారు.

దర్శకుడు తనకు నేరుగా ఎలాంటి అనుచిత ప్రతిపాదన చేయలేదని, అయితే అతడి ప్రవర్తనను బట్టి ముందుగానే జాగ్రత్తపడ్డానని విద్యా బాలన్ స్పష్టం చేశారు. ఈ ఘటనను పూర్తిస్థాయి క్యాస్టింగ్ కౌచ్ అనుభవంగా అభివర్ణించలేనప్పటికీ, తన భద్రత విషయంలో రాజీపడలేదని తెలిపారు. సినీ రంగంలో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురుకాలేదని, ఆ విషయంలో తాను అదృష్టవంతురాలినని పేర్కొన్నారు. ఎలాంటి అవకాశమైనా వ్యక్తిగత భద్రత కంటే ముఖ్యమైనది కాదనే సందేశాన్ని ఆమె వ్యాఖ్యలు మరోసారి గుర్తుచేస్తున్నాయి.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save