గోప్యతా చట్టంపై వార్తా సంస్థల సంఘం ఆందోళన
ఇందులో అంబానీ, అదానీ సంస్థలూ సభ్యులే
చట్టాన్ని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
కేంద్రానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు
న్యూఢిల్లీ : బిలియనీర్లు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల యాజమాన్యాలలోని కంపెనీలు సహా 21 వార్తా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డీఎన్పీఏ) భారత గోప్యతా చట్టాన్ని న్యాయస్థానంలో సవాలు చేసింది.
ఈ చట్టం పరిశోధనాత్మక జర్నలిజం కార్యకలాపాలను అణచివేస్తోందని, జర్మలిస్టులకు సమాచారాన్ని అందించే వర్గాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించేలా చేస్తోందని ఈ సంఘం వాదించింది.
కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం గత సంవత్సరం డిజిటల్ వ్యక్తిగత డేటాను పరిరక్షించే పేరుతో గోప్యతా చట్టాన్ని తీసుకొస్తున్నానని ప్రకటించింది.
దీంతో మెటా, గూగుల్ వంటి సామాజిక మాధ్యమ వేదికలు విధిగా నిబంధనలను పాటించాల్సిన అవసరం ఏర్పడింది.
మీడియా సంస్థలకు మినహాయింపు లేకపోవడంతో ఈ చట్టాన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగా ఆ సంస్థలు అభివర్ణించాయి.
చట్టానికి ప్రధాన సవాలుగా డీఎన్పీఏ వ్యాజ్యం
ప్రభుత్వం ఆగస్టులో మీడియా సంస్థలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
గోప్యతా చట్టం పత్రికా స్వేచ్ఛను కాపాడుతుందని ఆ సమావేశంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది.
అయితే యూరోపియన్ యూనియన్, సింగపూర్, బ్రిటన్లో ఉన్న విధంగా ఈ చట్టంలో పాత్రికేయులకు లిఖితపూర్వక మినహాయింపులేవీ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రహస్య పత్రంలో డీఎన్పీఏ పేర్కొంది.
చట్టాన్ని సవాలు చేస్తూ డీఎన్పీఏ ఈ నెల ఆరు వ తేదీన కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న గోప్యతా చట్టానికి ఇది ఓ ప్రధానమైన సవాలు.
ఇప్పటి వరకూ కేవలం భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన కార్యకర్తలు, కొన్ని చిన్న చిన్న వార్తా సంస్థలు మాత్రమే ఈ చట్టాన్ని సవాలు చేశాయి.
ఇదేమి గోప్యత ?
ఈ పిటిషన్ అంబానీ, అదానీల నేతృత్వంలోని వ్యాపార సంస్థల నుంచి ప్రభుత్వానికి ఓ అసాధారణ సవాలుగా పరిణమించింది.
ఎందుకంటే ఈ సంస్థలు మోడీకి సన్నిహితమైనవని, ప్రభుత్వం వాటికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి.
అయితే ఈ ఆరోపణలను ఆ సంస్థలు, ప్రభుత్వం తీవ్రంగా ఖండించాయి.
కాగా వచ్చే సంవత్సరం మే నుంచి ఈ చట్టం అమలులోకి వస్తుంది.
ఇందులోని వివాదాస్పద నిబంధనలను రద్దు చేయాలని ప్రచురణకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
గోప్యతా చట్టం ప్రకారం...
ఎవరైనా పాత్రికేయుడు తాను దర్యాప్తు చేయాలని అనుకుంటున్న వ్యక్తి నుంచి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
అంతేకాక ప్రచురితమైన పరిశోధనాత్మక కథనాలను తొలగించాలని ప్రచురణకర్తపై ఈ చట్టం ఒత్తిడి తేవచ్చు.
పాత్రికేయులకు ఎక్కడ నుంచి సమాచారం వచ్చిందో తెలుసుకునే హక్కు కూడా ఈ చట్టం ద్వారా ప్రభుత్వానికి దఖలు పడుతుంది.
అలాంటప్పుడు ఇక గోప్యతకు అర్థం ఏముందన్న ప్రశ్న తలెత్తుతోంది.
పత్రికా స్వేచ్ఛకు గ్రహణం
ఈ చట్టం పరిశోధనాత్మక జర్నలిజాన్ని కేవలం సంఘటనలను నమోదు చేసే బలహీనమైన సాధనంగా మారుస్తుందని 698 పేజీల ఫైలింగులో డీఎన్పీఏ తెలియజేసింది.
దీనిలోని నిబంధనల్లో ముందస్తు సెన్సార్షిప్ ఉన్నదని, ఈ చట్టం ఏ ప్రజాస్వామ్యానికైనా విఘాతం కలిగిస్తుందని ఆరోపించింది.
2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పత్రికా స్వేచ్ఛ క్షీణిస్తోందన్న ఆరోపణల మధ్య ఈ వ్యాజ్యం దాఖలైంది.
రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ వెలువరించిన పత్రికా స్వేచ్ఛ సూచికలో 2014లో మనం 140వ స్థానంలో ఉండగా ఈ ఏడాది అది 157కు (మొత్తం దేశాలు 180) పడిపోయింది.
అయితే ప్రభుత్వం ఈ ర్యాంకును తిరస్కరించింది.
పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తామని,
వందలాది వార్తా పత్రికలు,
టీవీ ఛానల్స్ ఉన్న భారతదేశానికి విదేశీ సంస్థల ధృవీకరణ అవసరం లేదని స్పష్టం చేసింది.
సాక్ష్యాలు ధ్వంసం కావచ్చు
మన దేశంలో 22 ప్రముఖ ప్రింట్, టీవీ మీడియా సంస్థలతో కూడిన డీఎన్పీఏలో అంబానీకి చెందిన నెట్వర్క్ 18కి ఏడు డిజిటల్ వార్తా వేదికలు ఉన్నాయి.
ఈ సంస్థలో అదానీకి చెందిన ఎన్డీటీవీ (ఎన్డీటీవీ.ఎన్ఎస్) కూడా సభ్యురాలే.
వీటితో పాటు ది ఇండియన్ ఎక్స్ప్రెస్,
టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపునకు చెందిన టైమ్స్ ఇంటర్నెట్ వంటి ఇతర ప్రముఖ మీడియా గ్రూపులకు కూడా ఇందులో సభ్యత్వం ఉంది.
సమాచారం పొందాల్సిన వ్యక్తి నుంచి సమ్మతి తప్పనిసరి అనే నిబంధన ఆందోళన కలిగిస్తోందని ఈ సంఘం తన పిటిషన్లో తెలియజేసింది.
సామాజిక మాద్యమ వేదిక లేదా ఆన్లైన్ రిటైలర్ సైన్ అప్ చేసే సమయంలో వినియోగదారుల నుంచి సమ్మతి పొందవచ్చునని, కానీ పరిశోధన జరిపేటప్పుడు దాని వివరాలను సంబంధిత వ్యక్తికి తెలియజేసి అతని అనుమతి తీసుకోవాలని నిర్దేశించడమంటే సాక్ష్యాలను నాశనం చేయడానికి, సాక్షులను బెదిరింపడానికి అవకాశం ఇవ్వడమే అవుతుందని వాదించింది.
చట్టంలో ఏముందంటే...
ఈ చట్టంలో మరో ప్రమాదకరమైన నిబంధన ఏమిటంటే సమ్మతిని తెలియజేసిన వ్యక్తి ఎప్పుడైనా దానిని ఉపసంహరించుకోవచ్చు.
తన డేటాను తొలగించాలని డిమాండ్ చేయవచ్చు. వాస్తవ నివేదికను ప్రచురించవద్దని లేదా దానిలోని సమాచారాన్ని పెద్ద ఎత్తున సవరించాలని ఆ వ్యక్తి మీడియా సంస్థను బలవంతం చేయవచ్చు.
ఈ చట్టం ద్వారా ఏర్పడే అధికార సంస్థ నిబంధనలు పాటించని మీడియా సంస్థలకు జరిమానాలు విధిస్తుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ సమాచారమైనా లభించకుండా నిరోధించే అధికారాన్ని ఈ చట్టం కేంద్రానికి కట్టబెడుతోంది.
ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛను హరిస్తాయని ప్రచురణకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీఎన్పీఏ ఆగస్టులో ప్రభుత్వానికి ఓ లేఖ రాస్తూ పత్రికా రంగానికి స్వేచ్ఛ కల్పించడంలో విఫలమవుతున్న ప్రభుత్వానికి ఈ చట్టం విస్తృత మినహాయింపులు ఇస్తోందని విమర్శించింది.
అయితే ఈ లేఖకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
వ్యక్తిగత డేటాను నిర్వహించే ఏ సంస్థనైనా ఆ సమాచారాన్ని అందజేయాలని ఆదేశించే అధికారం ఈ చట్టం ద్వారా ప్రభుత్వానికి లభిస్తుంది.
అవినీతి, కార్పొరేట్ తప్పిదాలు, ఎన్నికల అవకతవకలకు సంబంధించిన సమాచారాన్ని పాత్రికేయులతో పంచుకోకుండా ఈ చట్టం విజిల్బ్లోయర్లను నిరుత్సాహపరుస్తుంది.
ఇలాంటి అనియంత్రిక నిబంధనలను రద్దు చేయాలని డీఎన్పీఏ డిమాండ్ చేస్తోంది.
ఈ కేసుకు సంబంధించికేంద్రానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది