Global Vaartha
Date of Publish : 28/10/2026, 2:57 pm
Editor : భవ్య జర్నలిస్ట్

డబ్ల్యూబీబీఎల్‌: బ్రిస్బేన్ హీట్ జట్టులో భారత క్రికెటర్‌కు చోటు!

స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియా వేదికగా జరురుగుతున్న ప్రతిష్ఠాత్మక మహిళల బిగ్‌బాష్ లీగ్ (WBBL) టోర్నమెంట్‌లో భారత మహిళా క్రికెటర్ యస్తికా భాటియా చేరనుంది. బ్రిస్బేన్ హీట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్, సౌతాఫ్రికాకు చెందిన జెస్ జోనాసెన్ తుంటి గాయం కారణంగా ఈ సీజన్‌కు పూర్తిగా దూరమైంది. వైద్యుల సూచన మేరకు జోనాసెన్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో, ఆమె స్థానంలో యస్తికా భాటియాను బ్రిస్బేన్ హీట్ ఫ్రాంచైజీ తమ జట్టులోకి ఎంపిక చేసింది.వికెట్ కీపర్, బ్యాటర్ అయిన యస్తికా భాటియా గతంలో మెల్‌బోర్న్ స్టార్స్ జట్టు తరఫున డబ్ల్యూబీబీఎల్‌లో ప్రాతినిధ్యం వహించింది. అయితే బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున ఆమె బరిలోకి దిగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అంతేకాకుండా ఈ సీజన్‌లో డబ్ల్యూబీబీఎల్‌లో ఆడుతున్న ఏకైక భారతీయ క్రీడాకారిణిగా యస్తికా నిలవడం గమనార్హం. ఆమె జట్టు రెండో మ్యాచ్‌ నుంచి స్క్వాడ్‌తో కలవనుంది. సిడ్నీ థండర్‌తో జరిగే మ్యాచ్‌లో ఆమె అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

భాటియా రాకపై బ్రిస్బేన్ హీట్ హెడ్ కోచ్ మార్క్ సోరెల్ హర్షం వ్యక్తం చేశారు. టోర్నీ ప్రారంభానికి ముందు అనుభవజ్ఞురాలైన అంతర్జాతీయ క్రీడాకారణీ జట్టులోకి తీసుకోవడం తమకు సానుకూలాంశమని పేర్కొన్నారు. జోనాసెన్ లేని లోటును యస్తికా భర్తీ చేయగలదని, ఆమెకు ఆస్ట్రేలియా పిచ్‌లపై మంచి అనుభవం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. టీమిండియా మహిళల టీ20 జట్టు తరఫున ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు ఆడిన యస్తికా భాటియా 374 పరుగులు సాధించింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save