Global Vaartha
Date of Publish : 28/10/2026, 4:22 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రావద్దు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

  • స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలి..
  • ట్రీటెడ్ వాటర్ ట్యాంకర్లను ట్రాక్ చేయాలి..
  • నీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షించాలి..

హైదరాబాద్: నీటి నాణ్యతపై రాజీ పడొద్దని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో ఎస్‌టీపీలు, ట్రీటెడ్ వాటర్‌పై సీఎం ఈరోజు (బుధవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, టీజీఎస్‌పీడీసీఎల్ ఎండీ జితేశ్ వి. పాటిల్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి రవి, సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుందరెడ్డి హాజరయ్యారు. ట్రీటెడ్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో ఏఐ టెక్నాలజీని వినియోగించాలని మార్గనిర్దేశం చేశారు.

స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలి..

ప్రతి ప్లాంట్ దగ్గర స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్లాంట్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. ఈ ప్లాంట్లపై హైడ్రా మానిటరింగ్ ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఇతర ప్రాంతాల్లో ల్యాండ్‌స్కేప్‌లు, రోడ్ క్లీనింగ్‌కు ట్రీటెడ్ వాటర్‌ను మాత్రమే వాడాలని సూచించారు. సెక్రటేరియట్, సీఎం కార్యాలయం ల్యాండ్‌స్కేప్‌లతో పాటు పబ్లిక్ పార్కుల్లో కూడా ట్రీటెడ్ వాటర్‌ను వినియోగించాలని నిర్దేశించారు. రైల్వే డిపార్ట్‌మెంట్‌తో పాటు మెట్రో రైల్‌ను కూడా ఈ పరిధిలోకి తీసుకురావాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర అవసరాల కోసం వందశాతం ట్రీటెడ్ వాటర్‌ను వాడాల్సిందేనని.. దీన్ని తప్పనిసరి చేయాలని ఆదేశించారు.

ట్రీటెడ్ వాటర్ ట్యాంకర్లను ట్రాక్ చేయాలి..

ట్రీటెడ్ వాటర్ ట్యాంకర్లను ట్రాక్ చేయాలని.. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ వాటర్ కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రీటెడ్ వాటర్‌నే వినియోగించాలని.. భవన నిర్మాణ అనుమతుల సమయంలోనే ఈ నిబంధనను విధించాలని మార్గనిర్దేశం చేశారు. ట్రీటెడ్ వాటర్ ప్లాంట్లను సోలార్ పవర్‌తో నడిపే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రైవేట్ ఎస్‌టీపీలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

నీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షించాలి..

డేటా సెంటర్లకు కూడా ట్రీటెడ్ వాటర్‌ను అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ వరకు ఆదేశాలు అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. భవిష్యతు అవసరాలకు అనుగుణంగా చర్యలు ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని.. అధికారులు నిర్లక్ష్యంగా ఉండవద్దని హుకుం జారీ చేశారు. మంచి నీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షించాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save