హైదరాబాద్ : ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని SIR పేరుతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఓట్లను తొలగిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. SIRపై రెండు సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఓట్ల తొలగింపు నిజమేనని తేటతెల్లం అయ్యిందన్నారు. తొలగించిన ఓట్లను పునఃపరిశీలించి.. వారికి ఓటు హక్కు కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం నిద్రపోతున్నట్లు నటిస్తోందని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా నవంబర్ 1న ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించనున్నట్లు చెప్పారు.రైళ్లలో ప్రయాణం చేయడానికి అనుమతి అడుగుతుంటే కేంద్రం నుంచి అనుమతి రాలేదని మంత్రి తెలిపారు. గత పది రోజుల నుంచి ఇండియా కూటమిని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. రైల్వే అంటే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ సొత్తు కాదన్నారు. రైళ్లు, బోగీలు ఇవ్వనందుకు పీసీసీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటి బయట పెడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.