Global Vaartha
Date of Publish : 28/10/2026, 4:37 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఆర్నబ్ తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా వేయండి.. అధికారులకు సీఎం ఆదేశం

అమరావతి, :పారిశుద్ధ్య సమస్యలు, తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, ఉద్యానవన శాఖలతోపాటు వివిధ విభాగాలు ఆర్నబ్ తుఫాన్ నష్టం అంచనాలపై దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. పశుసంపదకు జరిగిన నష్టం, ఇళ్లు కూలిపోవడం, నీట మునగడం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. విద్యుత్, రహదారుల వ్యవస్థలకు జరిగిన నష్టాన్ని, చెరువులకు గండ్లు పడిన అంశాలను క్షేత్రస్థాయి నుంచి సేకరించాలని మార్గనిర్దేశం చేశారు.

కోనసీమలో 33 వేల కొబ్బరి చెట్లు పడిపోయాయి..

ఈరోజు (బుధవారం) ఆర్నబ్ తుఫాన్‌పై సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాన్ సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రహదారులపై కూలిన చెట్ల తొలగింపుపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్లతో మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల వారీగా పరిస్థితులను, గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను ముఖ్యమంత్రికి ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ వెల్లడించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కోనసీమలో సుమారు 33 వేల కొబ్బరి చెట్లు పడిపోయినట్లుగా అధికారులు తెలిపారు. కోనసీమ జిల్లాలో సుమారు 10 వేల చెట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 వేల చెట్లు కూలిపోయినట్లుగా వివరించారు. జాతీయ రహదారి-16పై కూలిన చెట్లను వెంటనే తొలగించినట్లు వెల్లడించారు.

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలి..

వివిధ ప్రాంతాల్లో కూలిన చెట్ల తొలగింపు పనులను మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలు మినహా మిగిలిన తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని అధికారులు వెల్లడించారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. తుఫాన్ సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల కోసం ఏపీసీపీడీసీఎల్ నుంచి కూడా సిబ్బందిని పంపాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని మార్గనిర్దేశం చేశారు. కూలిన చెట్లను వెంటనే తొలగించి, సాయంత్రానికి అన్ని జిల్లాల్లో రహదారులను పూర్తిస్థాయిలో క్లియర్ చేయాలని సూచించారు.

నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలి..

‘రాష్ట్రంలోని రిజర్వాయర్లలోకి వస్తున్న నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితులను పర్యవేక్షించడంతోపాటు వరద నీటి నిర్వహణపై దృష్టి సారించాలి. విద్యుత్ సరఫరా, తాగునీరు, రాకపోకలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. గత పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని 26 తుఫాన్లు తాకాయి. గతంలో సంభవించిన దివిసీమ ఉప్పెనలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. దివిసీమ ఉప్పెన, హుద్ హుదు, తిత్లీ తుఫాన్ల సమయంలో పెనుగాలులు భీభత్సం సృష్టించాయి. వరదల సమయంలో అప్పటి ప్రభుత్వ వైఖరి కారణంగా వ్యవస్థలు విఫలమయ్యాయి. బుడమేరు వరదల్లో విజయవాడ లోనే ఉండి వ్యవస్థను గాడిలో పెట్టగలిగాం ప్రస్తుతం అర్నబ్ తుఫానులో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి.రాష్ట్రాన్ని తాకిన ప్రతి తుఫాన్ నుంచి ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే పాఠాలను నేర్చుకుంటున్నాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించగలుగుతున్నాం..

‘టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించగలుగుతున్నాం. అన్నిస్థాయిల్లో అధికారులు ఒకే విధమైన ఆలోచనతో పనిచేస్తూ, అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి ప్రజలను కాపాడేందుకు, వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాం. ప్రకృతి విపత్తుల సమయంలో క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా తక్షణ నిర్ణయాలు తీసుకుని, వాటిని సమర్థంగా అమలు చేయాలి. గత రాత్రి నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ పరిస్థితులు, సహాయక చర్యలను సమీక్షిస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save