Global Vaartha
Date of Publish : 28/10/2026, 4:47 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఏఐ వినియోగ లక్ష్యం: భట్టి విక్రమార్క

హైదరాబాద్: ఏఐతో ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Telangana Deputy CM Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఏఐ వినియోగ లక్ష్యమని పేర్కొన్నారు. ‘ఏఐ సాక్షమ్‌’ ప్రారంభోత్సవంలో భట్టి విక్రమార్క ఈరోజు (బుధవారం) పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. ఆయా కార్యాలయాల్లో ఆదా అయ్యే సమయాన్ని ప్రజలకు కేటాయించాలని సూచించారు.

కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి మారాలి..

రైతులు, పింఛనుదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి మారాలని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యం పెంపొందించేందుకే ‘ఏఐ సాక్షమ్‌’ను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాధనం వినియోగం, ప్రాజెక్టుల వ్యయాల విశ్లేషణకు ఏఐ ఉపయోగపడుతుందని వివరించారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరుతున్నాయో, లేదో గుర్తించవచ్చని చెప్పుకొచ్చారు. విద్యుత్‌ డిమాండ్ అంచనా, పరికరాల లోపాల గుర్తింపులో ఏఐ కీలకంగా ఉపయోగపడుతుందని వెల్లడించారు.

ఏఐతో సమయం ఆదా..

ప్రభుత్వ ఉత్తర్వులు, నివేదికల తయారీలో ఏఐతో సమయం ఆదా అవుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. ఏఐ ఇచ్చే సమాచారాన్ని అధికారులు తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని సూచించారు. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఉద్ఘాటించారు. ఏఐ నిర్ణయాలపై మానవ పర్యవేక్షణ తప్పనిసరి అని చెప్పారు. ఏఐ వినియోగంలో తప్పులకు బాధ్యత వహించే వ్యక్తి ఎవరో స్పష్టత ఉండాలని అన్నారు. చిన్నస్థాయి ప్రయోగాల తర్వాతే ఏఐ వ్యవస్థల విస్తరణ చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలే ఏఐ విజయానికి కొలమానమని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save