Global Vaartha
Date of Publish : 28/10/2026, 5:22 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం

అమరావతి : ఆర్నబ్ తుఫాన్ కారణంగా ఏపీసీపీడీసీఎల్ (APCPDCL) పరిధిలో విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. 156 (33/11 కేవీ) సబ్‌స్టేషన్లు, 576 (11 కేవీ) ఫీడర్లకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే 93 సబ్‌స్టేషన్లు, 324 (11 కేవీ) ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. మరోవైపు 685 గ్రామాలు, 2,64,999 గృహ, వాణిజ్య (నాన్-అగ్రి) విద్యుత్ కనెక్షన్లకూ అంతరాయం కలిగింది. రంగంలోకి దిగిన అధికారులు 474 గ్రామాల్లో, 1,42,130 సర్వీసులను పునరుద్ధరించారు. మిగిలిన 1,22,869 సర్వీసులకు మరమ్మతులు కొనసాగుతున్నాయి.కాగా కృష్ణా జిల్లాలో అత్యధికంగా 560 గ్రామాలు, 94 సబ్‌స్టేషన్లు, 357 (11 కేవీ) ఫీడర్లపై తుఫాను ప్రభావం పడింది. దీని కారణంగా విద్యుత్ శాఖకు దాదాపు రూ. 30 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ఏపీసీపీడీసీఎల్ అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం 1995 మంది సిబ్బందితో కూడిన 399 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. తుఫాన్ కారణంగా 30,878 వ్యవసాయ (ఏజీఎల్) సర్వీసులకు అంతరాయం కలిగిందని చెప్పారు. వాటిలో 14,343 సర్వీసులను పునరుద్ధరించామని తెలిపారు.ఆర్నబ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్న వేళ.. ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికి తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఫోన్ చేశారు. తుఫాన్ తీవ్రత గురించి భట్టి విక్రమార్క అడిగి తెలుసుకున్నారు. ఆర్నబ్ కారణంగా ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని ఆయనకు మంత్రి గొట్టిపాటి వివరించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన చేపట్టిన నష్ట నివారణ చర్యలనూ చెప్పారు. ఈ సందర్భంగా ఏపీకి పూర్తి స్థాయిలో తమ మద్దతు ఉంటుందని మంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యలకు సిబ్బందిని, సామగ్రిని పంపేందుకు ముందుకొచ్చారు. కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలుస్తున్నందుకు గొట్టిపాటి రవి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save