Date of Publish : 28/10/2026, 9:47 pm
Editor : భవ్య జర్నలిస్ట్
కన్వీనర్ కోట సీట్లు సైతం అమ్ముకుంటున్న బీఈడీ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి:
- బీఈడీ కళాశాల అక్రమాలకు కొమ్ముకాస్తున్న యూనివర్సిటీ అధికారులు:
- ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్
యోగివేమన యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలలు కన్వీనర్ సీట్లు సైతం లక్షల రూపాయలకు అమ్ముకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాటికి కొమ్ముకాస్తు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న యూనివర్సిటీ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం ఏ.ఐ.ఎస్.బి ఆధ్వర్యంలో యోగివేమన యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...
యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా కళాశాల భవనం, స్టాఫ్ సైతం లేకుండా కేవలం ఫీజుల కోసం అడ్మిషన్స్ నిర్వహిస్తూ కన్వీనర్ సీట్లను సైతం లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని వారు తెలిపారు. కన్వీనర్ కోటలో సీటు పొందిన విద్యార్థులు కళాశాలకు వెళితే లక్ష రూపాయలు ఫీజు కడితేనే సీటు అంటూ యాజమాన్యాలు విద్యార్థులను బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నాయని వారు తెలిపారు. జిల్లాలో ఏ కళాశాలకు వెళ్ళినా అదే పరిస్థితి అని వారు తెలిపారు. అన్ని కళాశాల యాజమాన్యాలు సిండికేట్ గా ఏర్పడి లక్షల రూపాయలకు కన్వీనర్ కోట సీట్లను అమ్ముకుంటున్నారని వారు తెలిపారు. గతంలో అనేక కాలేజీలు కనీసం బిల్డింగ్ కూడా లేకుండా నిర్వహిస్తున్నారని కళాశాలల పేర్లతో సహా పిర్యాదు చేసిన యూనివర్సిటీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు స్పందించి బీఈడీ కళాశాలల అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. అనంతరం రిజిస్ట్రార్ గంగిరెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏ.ఐ.ఎస్.బి నాయకులు సైఫ్, అజ్దాన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.