Date of Publish : 28/10/2026, 9:56 pm
Editor : భవ్య జర్నలిస్ట్
నామినేషన్ల తిరస్కరణ పిటిషన్లను కొట్టివేసిన ఏపీ హైకోర్టు..
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల తిరస్కరణకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నామినేషన్ల తిరస్కరణను సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లన్నింటినీ ఇవాళ(బుధవారం) ధర్మాసనం కొట్టివేసింది. ఈ వ్యవహారంపై అభ్యంతరాలు ఉన్నవారు ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి ఎన్నికల పిటిషన్లు దాఖలు చేసుకోవాలని స్పష్టం చేసింది.విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. నామినేషన్లను ఉపసంహరించుకోకపోయినా ఉపసంహరించుకున్నట్లు అధికారులు ప్రకటించారని, తిరస్కరణ గురించి తమకు సమాచారం కూడా ఇవ్వలేదని తెలిపారు. రిటర్నింగ్ అధికారులు ఏకపక్షంగా, అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఉద్దేశపూర్వకంగానే తమ నామినేషన్లను తొలగించారని పిటిషనర్ల తరఫు లాయర్లు ఆరోపించారు.
మరోవైపు, రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున న్యాయవాదులు ఎన్.అశ్విని కుమార్, కే.అజయ్, త్రినాథ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన దశలో కోర్టులు జోక్యం చేసుకునేందుకు వీలులేదని వాదించారు. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు.. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత మధ్యలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. నామినేషన్లు తిరస్కరిస్తూ రిటర్నింగ్ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, చట్టప్రకారం ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని స్పష్టం చేస్తూ పిటిషన్లను కొట్టివేసింది.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.