Date of Publish : 30/10/2026, 9:46 am
Editor : భవ్య జర్నలిస్ట్
భూటాన్‌లో బద్దలైన హిమానీనదం.. బెంగాల్‌కు ఆకస్మిక వరద ముప్పు!
భూటాన్‌లోని హిమానీనదం బద్దలు కావడంతో భారత్‌లోని పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. కొండ ప్రాంతాల్లో సంభవించిన ఈ పరిణామంతో దిగువ ప్రాంతాల్లోని నదుల్లో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేశారు. అవసరమైన చోట్ల సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు . భూటాన్‌లోని వాయవ్య ప్రాంతమైన గాసా జిల్లాలో ఉన్న షింటాఫు సరస్సు వద్ద గురువారం సాయంత్రం హిమానీనదం బద్దలైంది. ఈ సరస్సు నుంచి భారీగా నీరు దిగువ ప్రాంతాలకు ప్రవహించింది. దీంతో గాసా త్షాచు ప్రాంతంలోని సౌకర్యాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. ముందుగానే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం సంభవించలేదని భూటాన్ అధికారులు వెల్లడించారు. వరద నీటి ప్రభావంతో రహదారులు, వంతెనలకు కూడా నష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. భూటాన్ నుంచి ప్రవహించే నీరు భారత్‌లోని నదీ వ్యవస్థల్లోకి చేరే అవకాశం ఉంది.
సంకోష్ నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉండడంతో పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దువార్, కూచ్‌బెహార్ ప్రాంతాలతో పాటు ఉత్తర బెంగాల్‌లోని మరికొన్ని ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అసోంలోని ధుబ్రి జిల్లాలోనూ వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. భూటాన్‌లోని పరిస్థితిని భారత అధికారులు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.