Global Vaartha
Date of Publish : 30/10/2026, 10:30 am
Editor : భవ్య జర్నలిస్ట్

ఏపీ, తెలంగాణల్లో మైక్రో బిజినెస్‌ రుణాల జోరు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో మైక్రో బిజినెస్‌ ఆంత్రప్రెన్యూర్‌ (ఎంబీ ఈ) రుణ మార్కెట్‌ వృద్ధి పథంలో సాగుతోందని ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌, నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐసీ) సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. గురువారం నాడిక్కడ ఈ నివేదికను ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ ఇజాజ్‌ నజీర్‌, ఎన్‌ఎస్‌ఐసీ జోనల్‌ మేనేజర్‌ (సౌత్‌ జోన్‌) సురేశ్‌ బాబు విడుదల చేశారు. ఈ ఏడాది జూన్‌ నాటికి వ్యాపార అవసరాల కోసం రుణాలు తీసుకున్న వ్యక్తిగత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.. గడచిన మూడేళ్ల కాలంలో వార్షిక ప్రాతిపదికన తెలంగాణలో 13 శాతం నుంచి 26 శాతానికి, ఏపీలో 11 శాతం నుంచి 25 శాతానికి పెరిగారని ఇజాజ్‌ నజీర్‌ తెలిపారు. వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి వ్యాపారాల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారు తెలంగాణలో 19.6 లక్షలుగా ఉండగా ఏపీలో 23.8 లక్షలుగా ఉన్నారని పేర్కొన్నారు. జూన్‌ నాటికి వీరు తీసుకున్న రుణాల మొత్తం దాదాపు వరుసగా రూ.1.74 లక్షల కోట్లు, రూ.1.45 కోట్లుగా ఉందని నజీర్‌ తెలిపారు. కాగా దేశవ్యాప్తంగా ఎంబీఈలు తీసుకున్న రుణాలు రూ.29.6 లక్షల కోట్లుగా ఉన్నాయన్నారు. అయితే ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.. ప్రభుత్వం నుంచి లభిస్తున్న ప్రోత్సాహకాలు తీసుకోకుండా తమ వ్యక్తిగత ఆస్తుల తనఖా ద్వారా అధిక వడ్డీకి ఈ రుణాలు తీసుకుంటూ వస్తున్నారని ఎన్‌ఎస్‌ఐసీ జోనల్‌ జనరల్‌ మేనేజర్‌ సురేశ్‌ బాబు తెలిపారు. ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.. తమ చిన్న తరహా సంస్థలను ఉద్యమ్‌ పోర్టల్‌ ద్వారా నమోదు చేసుకుంటే ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా తోడ్పాటు లభిస్తుందన్నారు. అంతేకాకుండా చిన్న తరహా సంస్థలకు అవసరమైన ముడి పదార్ధాలు, టెక్నాలజీ, పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌, క్రెడిట్‌ సౌలభ్యాన్ని కల్పించటంలో ఎన్‌ఎస్‌ఐసీ సాయపడుతుందని తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save