Date of Publish : 30/10/2026, 10:39 am
Editor : భవ్య జర్నలిస్ట్
ఆర్నబ్ తుపాను కష్టాల్లో ఏపీకి అండగా తమిళనాడు
తుపాను అర్నబ్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడారు. తుపాను సృష్టించిన విధ్వంసం, విద్యుత్ వ్యవస్థకు జరిగిన నష్టం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, లైన్లు, ఇతర విద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో పునరుద్ధరణ పనులకు అదనపు సిబ్బంది, సామగ్రి అవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని మంత్రి గొట్టిపాటి కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన తమిళనాడు ప్రభుత్వం.. ఏపీకి విద్యుత్ సిబ్బందితో పాటు అవసరమైన సామగ్రిని పంపేందుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులకు మరింత బలం చేకూరనుంది. ఇప్పటికే తెలంగాణ సాయం..
ఆర్నబ్ తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల సహకారం తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా విద్యుత్ పునరుద్ధరణ పనులకు సహాయం అందించాలని కోరింది. తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి విద్యుత్ శాఖ సిబ్బంది తుపాను ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని మరమ్మతు పనుల్లో పాల్గొంటున్నారు. మరోవైపు తమిళనాడు నుంచి కూడా సిబ్బంది, సామగ్రి అందుబాటులోకి వస్తే సహాయక చర్యలు మరింత వేగవంతం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.