Global Vaartha
Date of Publish : 30/10/2026, 8:00 pm
Editor : భవ్య జర్నలిస్ట్

మున్సిపల్ ఎన్నికల వేళ పులివెందులలో పోలీసుల భారీ ఫ్లాగ్ మార్చ్

  • ​శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం..
  • 5 కిలోమీటర్ల మేర సాగిన కవాతు.. ప్రజలకు భరోసా

సమీపిస్తున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ,ప్రజల్లో భద్రతాభావం కల్పించడమే లక్ష్యంగా పోలీసు శాఖ భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్,ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు నేతృత్వంలో సుమారు 5 కిలోమీటర్ల మేర ఈ కవాతు కొనసాగింది.
​పులివెందుల పోలీస్ స్టేషన్ వద్ద ప్రారంభమైన ఈ ఫ్లాగ్ మార్చ్ పూలంగళ్ల సర్కిల్, పాత బస్టాండ్,పాల్ రెడ్డి మెమోరియల్,పార్నపల్లి రోడ్డు,ముద్దనూరు రోడ్డు మీదుగా పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగి తిరిగి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.పులివెందుల డి.ఎస్పీ బుక్కే మురళి నాయక్ పర్యవేక్షణలో, అర్బన్ సీఐ పురుషోత్తం రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ప్రధాన కూడళ్లు,రద్దీ ప్రాంతాల్లో పోలీసులు మార్చ్ నిర్వహిస్తూ ప్రజలకు రక్షణపై పూర్తి భరోసా కల్పించారు. ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయం, ప్రలోభాలు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని, పట్టణంలో నిరంతర నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కవాతులో ప్రొద్దుటూరు డి.ఎస్పీ ఇ.బాలస్వామి రెడ్డి,ఆర్కే వ్యాలీ సీఐ శంకర్ రెడ్డి, పులివెందుల రూరల్ సీఐ శాంతి లాల్,వేంపల్లి సీఐ నరసింహులు,ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ కొండారెడ్డిలతో పాటు సబ్ డివిజన్ పరిధిలోని పలువురు ఎస్.ఐలు,భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save