Date of Publish : 31/10/2026, 9:49 am
Editor : భవ్య జర్నలిస్ట్
ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఢిల్లీలో పొగమంచు
ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం పొగమంచు కమ్ముకుంది. సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో 500 మీటర్లు, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న పాలంలో 800 మీటర్ల వరకు మాత్రమే విజిబిలిటీ కనిపించిందని శనివారం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. శుక్రవారం ఇదే సమయానికి ఈ రెండు ప్రాంతాల్లో విజిబిలిటీ 4,000 మీటర్లుగా ఉంది. సఫ్దర్‌జంగ్‌లో శనివారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి విజిబిలిటీ 500 మీటర్ల వద్దే కొనసాగుతోంది. పాలంలో ఉదయం 5 గంటల నుంచి 800 మీటర్లుగా రికార్డైంది. విజిబిలిటీ 500 నుంచి 999 మీటర్ల మధ్య ఉంటే దానిని స్వల్ప స్థాయి పొగమంచుగా, 200 నుంచి 499 మీటర్ల మధ్య ఉంటే మోస్తరు పొగమంచుగా, 50 నుంచి 199 మీటర్ల మధ్య ఉంటే దట్టమైన పొగమంచుగా భావిస్తారు. 50 మీటర్ల కన్నా తక్కువగా ఉంటే అతి దట్టమైన పొగమంచుగా వర్గీకరిస్తారు. ప్రస్తుతం సఫ్దర్‌జంగ్‌లో విజిబిలీటీ 500 మీటర్లకు పడిపోయింది. మరింత తగ్గితే మోస్తరు పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది.
వర్షం తర్వాత పొగమంచు
శుక్రవారం ఢిల్లీలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా గాలిలోని కాలుష్య కారకాలు తగ్గాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 60 గా నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఒక నివేదిక విడుదల చేసింది. గత నాలుగేళ్లలో అక్టోబర్‌లో ఇదే అత్యుత్తమ గాలి నాణ్యత. కాగా.. శనివారం ఉదయం 6 గంటలకు ఏక్యూఐ 95కు పెరిగింది. అయినప్పటికీ గాలి నాణ్యత సంతృప్తికర స్థాయిలోనే ఉంది. ఉదయం నమోదైన 58 కేంద్రాల్లో 17 చోట్ల పీఎం2.5, నాలుగు చోట్ల పీఎం10 ప్రధాన కాలుష్య కారకాలుగా ఉన్నట్లు సమాచారం. అక్టోబర్‌లో మొదటి 30 రోజులకు ఢిల్లీ సగటు ఏక్యూఐ 167గా నమోదైంది.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.