Date of Publish : 31/10/2026, 3:54 pm
Editor : భవ్య జర్నలిస్ట్
సమాజంలో ఇలాంటి దాడులకు చోటు లేదు.. రాప్తాడు ఘటనపై పవన్ కల్యాణ్.
రాప్తాడు జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థినిపై ఓ యువకుడు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. పాఠశాల తరగతి గదిలో ఉన్న పదో తరగతి బాలికపై చెట్లు నరికే రంపం యంత్రంతో ఓ యువకుడు దాడి చేశాడు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. విద్యార్థినిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. బాలిక తీవ్రంగా గాయపడిన విషయం తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా బాలిక కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ భరోసా ఇచ్చారు. నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి అమానవీయ ఘటనలకు సమాజంలో చోటు లేదని హెచ్చరించారు. కాగా, శనివారం ఉదయం పాఠశాలలో ఉన్న విద్యార్థినిపై ఓ యువకుడు దాడికి తెగబడ్డాడు. ఉపాధ్యాయురాలు మ్యాథ్స్ క్లాస్ చెబుతుండగా.. దుండగుడు హఠాత్తుగా తరగతి గదిలోకి ప్రవేశించాడు. అందరూ చూస్తుండగానే బాలికపై రంపం యంత్రంతో దాడి చేశాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ దాడిలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది బాధితురాలిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.