Date of Publish : 31/10/2026, 8:06 pm
Editor : భవ్య జర్నలిస్ట్
ప్రాణమా.. నువ్వంటే ఇంత నిర్లక్ష్యమా..?
- షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మళ్లీ వెలుగుచూసిన వైద్య సేవల లోపాలు...
- గర్భిణి, కడుపులోని శిశువు మృతితో కన్నీరుమున్నీరైన కుటుంబం..
గతంలోనూ ఇలాంటి ఘటనలు..
ఎమ్మెల్యే సూచించినా మారని తీరు.. బాధ్యులెవరు?*
మనిషి ప్రాణం ఎంతో విలువైనది. ఒక ప్రాణం పోతే ఓ కుటుంబం చిన్నాభిన్నమవుతుంది.
అలాంటి విలువైన ప్రాణాల విషయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యపు ఆరోపణలు తెరపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో మరోసారి చోటుచేసుకున్న విషాద ఘటన వైద్య సేవల తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
పురిటి బిడ్డను చేతుల్లోకి తీసుకోవాలని ఆశించిన ఓ కుటుంబానికి తల్లి, బిడ్డ ఇద్దరినీ కోల్పోయిన తీరని దుఃఖం మిగిలింది.
ఈ ఘటనపై ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన మల్లని రమేష్ కుమార్, రాధా దంపతులు ప్రసవం కోసం శుక్రవారం ఉదయం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు.
కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు రాధాను ఆసుపత్రిలోనే ఉంచి వైద్యం అందించారు.
పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పుడు ముందుగానే గుర్తించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాల్సి ఉండగా, చివరి దశలో పరిస్థితి విషమించాక హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారని బంధువులు ఆరోపిస్తున్నారు.
అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో తల్లి, కడుపులోని శిశువు ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి వర్గాల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
వైద్య బృందం వివరణ ఇచ్చినప్పటికీ తమకు సరైన సమాధానం లభించలేదని బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఆరోపణలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి.
కేశంపేట మండలం నుంచి ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ విషయంలోనూ చివరి నిమిషంలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో తల్లి, శిశువు మృతి చెందిన ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.
అలాగే కుటుంబ నియంత్రణ చికిత్స సందర్భంగా మహిళ కడుపులో వైద్య పరికరానికి సంబంధించిన ప్యాడ్ మరిచిపోయారనే ఆరోపణలు రావడం,
ఆమె ఆరోగ్యం విషమించడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి రావడం చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రధానంగా నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలే ఆధారపడుతుంటాయి. అలాంటి చోట వైద్య సేవల్లో లోపాలు ఉన్నాయనే ఆరోపణలు పదేపదే రావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవలే షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ వైద్య బృందంతో సమీక్ష నిర్వహించి, ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ అంకితభావంతో వైద్య సేవలు అందించాలని సూచించారు.
అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.
అయితే ఆ సమీక్ష జరిగిన కొద్ది రోజులకే మరో విషాద ఘటన చోటుచేసుకోవడంతో ఆసుపత్రి పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అసలు ఈ ఘటనలో ఏం జరిగింది?
గర్భిణి పరిస్థితిని వైద్యులు ముందుగానే గుర్తించలేకపోయారా?
మెరుగైన వైద్యం కోసం తరలించడంలో ఆలస్యం జరిగిందా?
వైద్య సేవల్లో నిజంగానే నిర్లక్ష్యం చోటుచేసుకుందా?
అన్న అంశాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.
బాధ్యులెవరైనా ఉంటే చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరిచి ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు..
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.