Global Vaartha
Date of Publish : 31/10/2026, 8:24 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఇది అత్యంత ప్రమాదకరమైన సంప్రదాయానికి నాంది: వైఎస్‌ జగన్‌

నారా చంద్రబాబు నాయుడి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అత్యంత ఆందోళనకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో జరుగుతున్న వరుస ఉల్లంఘనలను ఆయన గుర్తు చేశారు.స్థానిక ఎన్నికల్లో జరుగుతున్న ఉల్లంఘనలన్నీ నామినేషన్ల దశలోనే జరుగుతున్నాయన్న విషయాన్ని మరచి పోకూడదన్నారు వైఎస్‌ జగన్‌. అలాంటిది పోలింగ్ ముగిసి, ఫలితాలు ప్రకటించే సమయానికి ఇంకెంతటి పరిణామాలు చోటుచేసుకోవచ్చో ఊహించుకోవచ్చనే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు వైఎస్‌ జగన్‌.

ఇది అత్యంత ప్రమాదకరమైన సంప్రదాయానికి నాంది

‘‘ఎన్నికల్లో పోలింగ్‌ కూడా ప్రారంభం కాకముందే మొత్తం ఎన్నికల ప్రక్రియను ఎలా నిర్వీర్యం చేయవచ్చో ‘విజనరీ’ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు చూపించారు. ప్రతిపక్ష అభ్యర్థులను అసలు ఎన్నికల బరిలోకే రానివ్వకుండా అడ్డుకోవడం అత్యంత ప్రమాదకరమైన సంప్రదాయానికి నాంది పలుకుతోంది. ఇలాంటి విధానాలు దేశమంతటా విస్తరిస్తే ప్రజాస్వామ్య పునాదులకే ముప్పు వాటిల్లుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

నామినేషన్ల రిగ్గింగ్‌తో దౌర్జన్యాల పర్వం..

ఏ ఎన్నికలైనా నామినేషన్లతోనే ప్రారంభమవుతాయని, నామినేషన్‌ లేకపోతే పోటీ ఉండదన్నారు. ‘‘పోటీ లేకపోతే ఓటరుకు ఎవరిని ఎన్నుకోవాలనే అవకాశం ఉండదు. కానీ, ఇప్పుడు మన రాష్ట్రంలో ఆ ప్రక్రియలోనే దౌర్జన్యాల పర్వం మొదలైంది. వైఎస్సార్‌సీపీకి చెందిన ముఖ్య నేతలు, సీనియర్‌ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడం, వారిపై బైండోవర్‌ చర్యలు చేపట్టడం, మా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వారెవ్వరూ బయటకు వెళ్లకుండా నిరోధించడంతోనే అక్రమాలు మొదలయ్యాయి.

మరోవైపు నామినేషన్‌ కేంద్రాల చుట్టూ పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు స్వేచ్ఛగా గుమిగూడేందుకు అనుమతించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై మాత్రం ఆంక్షలు విధించి, వారితో పాటు కేవలం ఇద్దరు లేదా ముగ్గురిని మాత్రమే వెళ్లనిచ్చారు. దీంతో అప్పటికే అక్కడ గుమిగూడిన టీడీపీ మూకల మధ్య వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయింది.

దీంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై యథేచ్ఛగా దాడులు చేశారు. వారి నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించివేశారు. చివరికి మహిళా అభ్యర్థులను కూడా వదిలి పెట్టలేదు. పోలీసులు, రిటర్నింగ్‌ అధికారుల సమక్షంలోనే ఏకంగా ఎంపీలు, మాజీ మంత్రులపైనా దాడులు జరిగాయి. ఈ ఘటనలన్నీ తమ కళ్లెదుటే జరుగుతున్నా పోలీసులు, రిటర్నింగ్‌ అధికారులు చూస్తూ ఉండిపోయారు. టీడీపీ గూండాలకు వారు సహకరించడంతో అవన్నీ కొనసాగాయి. ఫలితంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసే అవకాశాన్నే కోల్పోయారు’’ అని స్పష్టం చేశారు.

వైఎస్సార్‌సీపీ పేరుతో నకిలీ నామినేషన్లు

గతంలో ఎప్పుడూ చూడని మరో ఆందోళనకరమైన పరిణామం ఏమిటంటే, టీడీపీ సానుభూతిపరులు తాము వైఎస్సార్‌సీపీ తరఫున నిలబెట్టిన అభ్యర్థులమని తప్పుడు ప్రకటనలు చేస్తూ నామినేషన్లు దాఖలు చేయడమని వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘‘ఒకవైపు వైఎస్సార్‌సీపీ నిజమైన అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూనే, మరోవైపు ఇలాంటి నకిలీ నామినేషన్ల ద్వారా ప్రతిపక్ష పార్టీ కూడా స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం పొందిందనే భ్రమ కల్పించారు. అన్ని పార్టీలకూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాన అవకాశాలు కల్పించినట్లు ప్రజలను, న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టించడమే దీని ఉద్దేశం. పార్టీ అధికారిక అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నప్పుడు, కేవలం వైఎస్సార్‌సీపీ పేరుతో నామినేషన్లు ఉన్నంత మాత్రాన అక్కడ నిష్పక్షపాతమైన ఎన్నిక జరుగుతుందని చెప్పలేం. పార్టీ అసలైన అధికారిక అభ్యర్థి ఎవరనేది నిర్ధారించే ఫారం–ఏ, ఫారం–బీలను కూడా పట్టించుకోలేదు’’ అని మండిపడ్డారు.

పక్షపాత స్క్రూటినీ.. బలవంతంగా ఉపసంహరణలు

అన్ని అడ్డంకులు ఎదుర్కొని ఎక్కడైనా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తే.. ఆ తర్వాత వారిపై విపరీతమైన ఒత్తిళ్లు కొనసాగాయని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ‘‘నామినేషన్లు ఉపసంహరించుకోవాలని అభ్యర్థులను బెదిరించారు. బలవంతం చేశారు. ఆ బెదిరింపులకు లొంగని అభ్యర్థుల నామినేషన్లను స్క్రూటినీ పేరుతో చిన్న చిన్న, అర్థంలేని కారణాలు చూపిస్తూ తిరస్కరించారు. నామినేషన్‌ పత్రాలతో పాటు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు తొలగించడం లేదా వాటిని తారుమారు చేయడం జరిగింది. అనంతరం అవసరమైన పత్రాలు లేవనే కారణంతో రిటర్నింగ్‌ అధికారులు ఆ నామినేషన్లను తిరస్కరించారు. అంటే, అన్ని పత్రాలను పూర్తిగా సమర్పించి, వాటికి అధికారిక రసీదు కూడా పొందిన అభ్యర్థులనే, ఆ పత్రాలు అధికారుల ఆధీనంలోకి వెళ్లిన తర్వాత ఏర్పడిన లోపాలకు బాధ్యులను చేశారు’ అని తెలిపారు.

ఫోర్జరీ సంతకాలు.. వేరే వ్యక్తులతో నామినేషన్ల ఉపసంహరణ

మరికొన్ని ఘటనల్లో అభ్యర్థులు తాము అంగీకరించకపోయినా నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు చూపించారని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ‘‘అందుకు అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేసి ఉపసంహరణ పత్రాలను చూపారు. వాటిని అధికారులు గుడ్డిగా ఆమోదించారు. దీంతో అసలైన అభ్యర్థులకు తెలియకుండానే, వారి సమ్మతి లేకుండానే ఎన్నికల్లో పోటీ చేసే హక్కును హరించారు. అంటే బెదిరింపులు, దాడులు, స్క్రూటినీ పేరుతో ఎదురైన అడ్డంకులన్నింటినీ అధిగమించిన అభ్యర్థిని కూడా చివరకు మోసపూరిత ఉపసంహరణ ద్వారా ఎన్నికల బరి నుంచి తొలగించే పరిస్థితి ఏర్పడింది.

ఈ ప్రక్రియ మొత్తంలో పోలీసులు, రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల యంత్రాంగం కుమ్మక్కయ్యారు. అలా ప్రతిపక్ష అభ్యర్థులను ఎన్నికల బరి నుంచి తప్పించేందుకు టీడీపీ చేసిన కుట్రకు అంతా సహకరించారు. వాస్తవానికి ప్రతి అభ్యర్థికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ప్రతి ఓటరుకు తనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే హక్కు పరిరక్షించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. అందుకే ప్రతి ఫిర్యాదుపైనా స్వతంత్ర దర్యాప్తు జరగాలి. నామినేషన్‌ పత్రాలు, స్క్రూటినీ రికార్డులు, ఉపసంహరణ పత్రాలు, వీడియో ఫుటేజీని భద్రపరిచి క్షుణ్ణంగా పరిశీలించాలి. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే పరిస్థితి..

అన్యాయంగా ఎన్నికల బరి నుంచి తప్పించిన అభ్యర్థులకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలి. ప్రజల మద్దతు తమకే ఉందని చంద్రబాబునాయుడికి నమ్మకం ఉంటే, మరి ఆయన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎందుకు అడ్డుకుంటోంది? తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే అవకాశాన్ని ఓటర్లకు ఎందుకు నిరాకరిస్తోంది? నామినేషన్ల దాఖలు, ఆ తర్వాత ఉపసంహరణ దశలోనే ఇంతటి అరాచక పరిస్థితులు నెలకొంటే.. ఇక పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన సమయంలో ఇంకేం జరుగుతుందోనన్న తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయి.

రేపటి (నవంబరు 1, ఆదివారం) నుంచే స్థానిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థులు ఎన్నికల్లో పాల్గొనేలా, పోలింగ్‌ ఏజెంట్లు తమ విధులను నిర్వర్తించేలా, ఓటర్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్టమైన, స్వతంత్ర పర్యవేక్షణ అత్యంత అవసరం. ఇన్ని దౌర్జన్యాలతో ఎన్నికల ప్రక్రియను ఇంత దారుణంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటే, ప్రమాదంలో పడేది ప్రజాస్వామ్యమే అనేది వాస్తవం’’ అని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save