Date of Publish : 01/11/2026, 1:22 pm
Editor : భవ్య జర్నలిస్ట్
పులివెందుల ఆర్వో ఆఫీస్ వద్ద వైఎస్ జగన్ నిరసన
పులివెందుల ఆర్వో కార్యాలయం ముందు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరసన తెలిపారు. 70 మంది వైఎస్సార్సీపీ ఏజెంట్లతో కలిసి బైఠాయించారు. ఆర్వో శ్రీనివాస్, ఆర్డీవో చిన్నయ్యతో మాట్లాడిన వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ ఏజెంట్లను అడ్డుకోవడంపై ప్రశ్నించారు. ఎన్నికల అక్రమాలపై ఆయన ఫిర్యాదు చేశారు.‘‘ఎలక్షన్ అంటే పోటీ జరగాలి. ఎక్కడ చూసినా టీడీపీ గూండాలే కనబడుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేవు’’ అంటూ అధికారులను వైఎస్ జగన్ నిలదీశారు. ‘‘అధికారులు మౌనంగా ఉంటే ప్రజాస్యామ్యానికే ప్రమాదం. ఇలా జరిగితే వీటిని ఎన్నికలంటారా?. ఎన్నికల్లో అక్రమాలపై ఆధారాలన్నీ ఉన్నాయి. బిహార్ పరిస్థితులను ఏపీలో చూస్తున్నాం. మాజీ సీఎం నియోజకవర్గంలో ఈ పరిస్థితులేంటి?’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతకుముందు.. వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఏజెంట్లను అనుమతించకుండా, దాడులకు దిగడంపై చైర్పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ, ఇతర అభ్యర్థులు నిరసన చేపట్టారు. రిపోలింగ్ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉదయాన్నే బూత్‌లను ఆక్రమించుకుని రిగ్గింగ్ చేసుకున్నారన్న వైఎస్సార్సీసీ నేతలు.. ఏజెంట్లు, ఓటర్లు, మీడియా అనేది లేకుండా ఇష్టారీతిన దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆర్వో కార్యాలయంలోకి వెళ్లకుండా అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అభ్యర్థులు వస్తున్నారని తెలిసి ఆర్వో కార్యాలయానికి తాళం వేశారు. జరిగిన అక్రమాలు దేశమంతా చూసిందని.. వెంటనే ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.