అమరావతి : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7.00 గంటలకు ఈ రీపోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ రోజు సాయంత్రం 5.00 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అనంతపురం కార్పొరేషన్లో 30/3, తిరుపతి కార్పొరేషన్లో 36/4, కడప కార్పొరేషన్లో 15/2, మాచర్ల 23వ వార్డులోని 1, 2.., ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 14/1లో, జమ్మలమడుగు 3/2, 17/1, 29/1, పులివెందుల 1, 3, 7, 8 వార్డుల్లోని 1 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహిస్తుంది.ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరిగాయి. కొన్ని ఏకగ్రీవం కావడంతో.. 13 కార్పొరేషన్లతోపాటు 79 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా పలు పోలింగ్ బూత్‌లలో ఆక్రమాలపై ఎస్ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది.వివిధ ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లలో పలు అక్రమాలు జరిగినట్లు ఎస్ఈసీకి జిల్లా కలెక్టర్లు నివేదిక అందజేశారు. ఈ నేపథ్యంలో 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది. దీంతో సోమవారం ఆయా పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు.