Global Vaartha
Date of Publish : 02/11/2026, 10:17 am
Editor : భవ్య జర్నలిస్ట్

రైవాడలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్యాయత్నం

అనకాపల్లి: జిల్లాలోని దేవరాపల్లి మండలం రైవాడలో వ్యక్తిగత కలహాల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన తల్లికోడుకులతోపాటు కోడలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని 108 వాహనంలో కె.కోటపాడు ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పోలీసుల కథనం ప్రకారం.. రైవాడకు చెందిన చల్లా ఈశ్వరరావుకు గంధవరం గ్రామానికి చెందిన నాగమణికి పదిహేనేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరంతా రైవాడలో తల్లి వరహాలమ్మతో కలిసి ఉంటున్నారు. అయితే వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చోడవరం, దేవరాపల్లి పోలీస్ స్టేషన్లలో భర్త, అత్తపై నాగమణి ఫిర్యాదు చేసింది. అయితే ఆదివారం రాత్రి కూడా వీరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.

దీంతో పిల్లలను బయటకు పంపి.. ఈశ్వరరావు ఇంటి తలుపులు వేసుకున్నాడు. అనంతరం ఇంటి నుంచి బిగ్గరగా అరుపులు వస్తుండడంతో.. స్థానికులు వెంటనే స్పందించారు. ఇంటి తలుపులు పగలగొట్టి మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి.. ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులతో మాట్లాడిన తర్వాత విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save