అమరావతి : ‘మురసు’ తుఫాన్ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. మురసు తుఫాన్ట్ల అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుందని తెలిపారు. అత్యంత భారీ వర్షాల హెచ్చరికలు ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.వాగులు, వంకల చెంత జన సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ సూచించారు. తాగు నీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రజలు ప్రభుత్వం నుంచి వచ్చే హెచ్చరికలు పాటిస్తూ, యంత్రాంగానికి సహకరించాలని పవన్ కల్యాణ్ వెల్లడించారు.