Global Vaartha
Date of Publish : 02/11/2026, 12:47 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఎఫ్1 రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌గా ఆంటోనెల్లి.. అతి పిన్న వయస్కుడిగా రికార్డు

ఇంటర్నెట్ డెస్క్: ఫార్ములా వన్ (F1) చరిత్రలో సరికొత్త అధ్యాయం నమోదైంది. మెర్సిడెస్ జట్టు యువ డ్రైవర్ కిమీ ఆంటోనెల్లి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. కేవలం 20 ఏళ్ల వయసులోనే ఎఫ్‌1 ప్రపంచ టైటిల్ గెలుచుకుని.. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం జరిగిన మెక్సికో సిటీ గ్రాండ్‌ ప్రిక్స్‌లో మూడో స్థానంలో నిలవడంతో ఆంటోనెల్లి ఛాంపియన్‌షిప్ ఖరారైంది. ఈ రేసులో మాక్స్ వెర్‌స్టాపెన్, లూయిస్ హామిల్టన్ తొలి రెండు స్థానాల్లో నిలిచారు.

ఇప్పటివరకు ఈ రికార్డు జర్మనీ దిగ్గజ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ పేరిట ఉండేది. 2010లో తన తొలి ప్రపంచ టైటిల్ గెలిచే సమయానికి వెటెల్ వయసు 23 ఏళ్ల 133 రోజులు. ఇప్పుడు 20 ఏళ్ల ఆంటోనెల్లి ఆ రికార్డును అధిగమించాడు. ఎఫ్‌1లో తన రెండో సీజన్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలియగానే ఆంటోనెల్లి భావోద్వేగానికి గురయ్యాడు. టీమ్ రేడియోలో తొలుత ఏం మాట్లాడాలో తెలియక కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. అనంతరం ఆనందంతో 'మనం సాధించాం.. మనం సాధించాం!' అంటూ కేకలు వేశాడు.

73 ఏళ్ల తర్వాత ఇటలీకి ప్రపంచ టైటిల్!

ఆంటోనెల్లి విజయం ఇటలీ మోటార్‌స్పోర్ట్ చరిత్రలోనూ ప్రత్యేకంగా నిలిచింది. 1953లో అల్బెర్టో ఆస్కారి తర్వాత ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచిన తొలి ఇటాలియన్‌గా ఆంటోనెల్లి నిలిచాడు. దీంతో ఇటలీకి 73 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అంతేకాదు.. 21వ శతాబ్దంలో జన్మించి ఎఫ్‌1 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి డ్రైవర్‌గా కూడా రికార్డు సృష్టించాడు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save