Global Vaartha
Date of Publish : 02/11/2026, 1:48 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఈనెల 5 నుంచి 7వ తేది వరకు కల్యాణ వవిత్రోత్సవాలు

చంద్రగిరి : శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈనెల 5 నుంచి 7వ తేది వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. ఈఉత్సవాలకు 4వ తేదిన సాయంత్రం 6 గంటలకు మత్స్యగ్రంహణం, సేనాధిపతి ఉత్సవం, అంకుర్పారణ కార్యక్రమాలతో శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు ఉదయం 9.30 గంటలకు ఆచార్య రుత్విక్‌వరణం నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలలో మొదటి రోజు 5వ తేది ఉదయం 8.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి, రాత్రి 7 గంటలకు పవిత్ర ప్రతిష్ట చేపడతారు. రెండో రోజైన 6వ తేదిన మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. చివరి రోజైన 7న రాత్రి 8.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలలో భాగంగా 5, 7 తేదిలలో ఉదయం 11 గంటలకు, 6వ తేదిన ఉదయం 10 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. 6వ తేది సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం వైభవంగా నిర్వహిస్తారు.

ఆలయ పవిత్రత పరిరక్షణకే పవిత్రోత్సవాలు

ఆలయంలో తెలియక జరిగే దోషాల నివారణకు, ఆలయ పవిత్రతను కాపాడేందుకు ప్రతి సంవత్సరము పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. వైదిక సంప్రదాయ ప్రకారం జతాశౌచం, మృతాశౌచం వంటి సందర్భాల్లో ఆలయ ప్రవేశం నిషిద్దం, భక్తులు, సిబ్బంది తెలియక చేసే పొరపాట్ల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా ఈఉత్సవాలను నిర్వహిస్తారు. ఈసందర్భంగా వేదపఠనం, ఆలయ శుద్ది, పుణ్యాహవచనం, తదితర వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save