Global Vaartha
Date of Publish : 02/11/2026, 2:57 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఐర్లాండ్‌పై నమీబియా చరిత్రాత్మక విజయం..

స్పోర్ట్స్ డెస్క్: నమీబియా క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఫుల్‌ మెంబర్‌ జట్టుపై మొట్టమొదటి సారి వన్డే సిరీస్‌ గెలిచింది. ఐర్లాండ్‌పై ఐదో వన్డేలో విజయం సాధించి ఈ అరుదైన ఘనత సాధించింది. ఐదు వన్డేల సిరీస్ ఆడేందుకు నమీబియా పర్యటనకు ఐర్లాండ్‌ వెళ్లింది. ఈ క్రమంలో తొలి వన్డేలో పసికూన నమీబియాను 55 పరుగుల తేడాతో ఓడించిన ఐరిష్‌ జట్టు.. రెండో వన్డేలో మాత్రం 31 పరుగుల తేడాతో ఓడింది.ఈ క్రమంలో మూడో వన్డేలో నమీబియా 63 పరుగుల తేడాతో గెలవగా నాలుగో వన్డేలో ఐర్లాండ్‌ ఏకంగా 130 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. దీంతో సిరీస్‌ 2-2తో సమం కాగా.. ఆదివారం నాటి నిర్ణయాత్మక మ్యాచ్‌లో నమీబియా అదరగొట్టింది. దీంతో 3-2 తేడాతో వన్డే సిరీస్ ను నమీబియా కైవసం చేసుకుంది. విండ్‌హాక్‌ వేదికగా జరిగిన ఐదో వన్డేలో టాస్‌ గెలిచిన ఐర్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. నమీబియా బౌలర్లు దెబ్బకు 33.1 ఓవర్లలో కేవలం 129 పరుగులకు ఆలౌటైంది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా కేవలం 21.2 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 131 పరుగులు స్కోరు చేసింది. లారెన్‌ స్టీంకాంప్‌ 46, కెప్టెన్‌ గెర్హాడ్‌ ఎరాస్మస్‌ 30 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో నమీబియా ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. తద్వారా టెస్టు హోదా ఉన్న జట్టుపై తొలిసారి ఈ ఘనత సాధించిన జట్టుగా నమీబియా నిలిచింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save