Global Vaartha
Date of Publish : 02/11/2026, 4:14 pm
Editor : భవ్య జర్నలిస్ట్

అభిషేక్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్..

స్పోర్ట్స్ డెస్క్: హమిల్టన్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో భారత్‌పై ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడినప్పటికీ 3-2 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ అంతటా నిలకడైన ప్రదర్శన కనబరిచిన కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును అందుకున్నాడు. ఇదే సమయంలో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ రికార్డును ఫిలిప్స్ బ్రేక్ చేశాడు.

ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా ఫిలిప్స్ కొత్త చరిత్ర సృష్టించాడు. 2026 సంవత్సరంలో భారత్‌పై ఫిలిప్స్ మొత్తం 522 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో ఐదో మ్యాచ్ ముందు వరకు అభిషేక్ శర్మ (న్యూజిలాండ్‌పై 431 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కేవలం ఒక పరుగు చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు గ్లెన్ ఫిలిప్స్ 65 పరుగులతో చెలరేగి ఆడాడు. దీంతో అభిషేక్‌ను ఫిలిప్స్ దాటేశాడు. ఇక మూడో స్థానంలో సాహిబ్జాద్ ఫర్హాన్(పాకిస్థాన్) నిలిచాడు. మరోవైపు ఐదు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఆఖరి టీ20 మ్యాచ్‌లో ఓడినప్పటికీ భారత ఆటగాళ్లు పలు వ్యక్తిగత మైలురాళ్లను అందుకున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నవంబర్ 1న సెడాన్ పార్క్ వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 191 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, కివీస్ బ్యాటర్లు టిమ్ సెఫర్ట్ (93 పరుగులు), గ్లెన్ ఫిలిప్స్ (65 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో న్యూజిలాండ్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.

ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు

522 గ్లెన్ ఫిలిప్స్ vs భారత్ (2026)

431 అభిషేక్ శర్మ vs న్యూజిలాండ్ (2026)

398 సాహిబ్జాదా ఫర్హాన్ vs శ్రీలంక (2026)

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save