Global Vaartha
Date of Publish : 02/11/2026, 4:26 pm
Editor : భవ్య జర్నలిస్ట్

టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో..

అమరావతి: ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ట్రస్ట్ బోర్డు పదవీకాలం ముగిసింది. ఈ మేరకు టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 658 జారీ చేసింది. ఈ అథారిటీ చైర్మన్‌గా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర (IAS)ను నియమించింది. అలాగే సభ్యులుగా ఆర్థిక శాఖ కార్యదర్శి వి.వినయ్ చంద్, దేవదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటయ్యే వరకు లేదా ఏడాది పాటు ఈ అథారిటీ కొనసాగనుంది. టీటీడీ ధర్మకర్తల మండలికి ఉండే అన్ని అధికారాలు, విధులను దీనికి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.కాగా, టీటీడీ ట్రస్ట్ బోర్డు పదవీకాలం ముగియడంతో నూతన పాలకమండలిని నియమించాల్సి ఉంది. సాధారణంగా టీటీడీ బోర్డు పదవీకాలం ముగిసిన వెంటనే నూతన పాలకమండలిని ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పాలకమండలి నియామకానికి ఆటంకం ఏర్పడింది. దీంతో తాత్కాలిక ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వామివారి కైంకర్యాలు, భక్తుల సౌకర్యాలు, దేవస్థానం నిత్యపాలన, రథసప్తమి వంటి కీలక ఉత్సవాల నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంది. ఈ మేరకు టీటీడీ పాలన కోసం స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలని నిర్ణయించింది. ఐఏఎస్ అధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ జీవో జారీ చేసింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save