వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.యుగంధర్ పిలుపునిచ్చారు. సోమవారం లింగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను, వైద్య సేవలను పరిశీలించారు.
మురసు తుఫాన్ ప్రభావం: ప్రస్తుతం తుపాను ప్రభావం వల్ల వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సిబ్బందిని ఆదేశించారు.
ఈ సందర్భంగా డాక్టర్ పి.యుగంధర్ మాట్లాడుతూ...
దోమల నివారణకు జాగ్రత్తలు: వర్షాలు కురుస్తున్నందున నిల్వ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెట్టి వృద్ధి చెందుతాయని, దీనివల్ల మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గర్భిణుల నమోదు: గర్భిణీ స్త్రీలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేర్లు నమోదు చేసుకొని వారికి సేవలు అందించాలని సూచించారు.
క్రమం తప్పకుండా టీకాలు: పిల్లలకు షెడ్యూల్ ప్రకారం అందించాల్సిన వ్యాధి నిరోధక టీకాలను వేళకు ఇవ్వాలని వైద్యాధికారులకు,ఆరోగ్య సిబ్బందికి ఆదేశించారు.
ఆసుపత్రిలోనే ప్రసవాలు: కాన్పులు సురక్షితంగా జరగడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఖాజా మౌనద్దీన్, స్థానిక వైద్యాధికారులు డాక్టర్ ప్రసన్న కుమార్, డాక్టర్ గౌతమి, సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య, సీనియర్ అసిస్టెంట్ నరేష్, సూపర్వైజర్ సరస్వతి, సిహెచ్ఓలు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు .