Global Vaartha
Date of Publish : 02/11/2026, 4:48 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ముక్కోణపు సిరీస్ గెలిచిన ఆనందంలో పాక్.. షాకిచ్చిన ఐసీసీ!

స్పోర్ట్స్ డెస్క్: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా లాహోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. టైటిల్ గెలిచిన ఆనందంలో ఉన్న షాహీన్ షా అఫ్రిది సేనాకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయడంలో విఫలమవడంతో జరిమాన పడింది. స్లో ఓవర్-రేట్ నిబంధన కింద పాకిస్థాన్ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధించినట్లు ఐసీసీ వెల్లడించింది.ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో పరిశీలనలో పాక్ జట్టు నిర్ణీత సమయానికి ఒక ఓవర్ వెనుకబడినట్లు నిర్ధారణ అయింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. జట్టు నిర్ణీత సమయానికి తక్కువ ఓవర్లు వేస్తే ప్రతీ ఓవర్‌కు 5 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా విధిస్తారు. తాజాగా పాకిస్థాన్ జట్టుకు జరిమానా విధిస్తూ ఆన్ ఫీల్డ్ అంపైర్లు అహ్సాన్ రజా, వేన్ నైట్స్, థర్డ్ అంపైర్ షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్‌లు నిర్ణయం తీసుకున్నారు. అయితే, పాకిస్థాన్ కెప్టెన్ షాహీన్ షా ఆఫ్రిది తన తప్పును అంగీకరించి.. శిక్షను స్వీకరించడంతో అధికారిక విచారణ నుంచి మినహాయింపు లభించింది.

మరోవైపు మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంక నిర్దేశించిన 326 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. అటాకింగ్ బ్యాటింగ్‌తో చెలరేగిన పాక్ జట్టు కేవలం 48.3 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ముక్కోణపు ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో పాక్ శిబిరంలో సందడి నెలకొంది. ఈ భారీ విజయంలో ఆ జట్టుకు జరిమానా చిన్నపాటి చేదు అనుభవంగా మిగిలిపోయింది. పాకిస్థాన్ వేదికగా ఆతిథ్య జట్టుతో పాటు ఇంగ్లండ్, శ్రీలంక మధ్య ట్రై సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్‌కు సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్‌ను పాకిస్థాన్ నిర్వహించింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save