Global Vaartha
Date of Publish : 03/11/2026, 10:29 am
Editor : భవ్య జర్నలిస్ట్

సీతాఫలం.. మరింత ప్రియం

  • ఎల్‌నినో ప్రభావంతో పెరిగిన సీతాఫలం ధరలు
  • నాణ్యతను బట్టి కాయ 30 నుంచి 50 రూపాయలు
  • వాతావరణ పరిస్థితులే కాదు..

హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు లేక అన్ని పంటలు దిగుబడి తగ్గాయి. ఈ క్రమంలోనే సీతాఫలంపైనా ఎల్‌నినో ప్రభావం పడింది. వర్షాలు సరిగ్గా కురవక సీతాఫలం పంట మార్కెట్‌లో భారీ ధర పలుకుతోంది. యాపిల్‌ పండ్లతో పోటీ పడుతోంది. ఎల్‌నినో దెబ్బకు వర్షాలు కురవకపోవడం, చెట్లను తొలగిస్తుండడంతో సీతాఫలం కనిపించకుండా పోతోంది. సీజన్‌ వచ్చిందంటే గుట్టలు, బంజరు భూములు, అటవీ ప్రాంతాల నుంచి గంపల కొద్దీ మార్కెట్లలోకి వచ్చే సీతాఫలం... ఈసారి సామాన్యులకు అందనంత దూరంలోకి వెళ్తోంది.రోగ నిరోధక శక్తిని అందించే ఈ సీజనల్‌ ఫ్రూట్‌ను జనం ఎగబడి కొంటుంటారు. వర్షాలు లేక కాయలు సరిగా కాయలేదు. ఈ క్రమంలోనే మార్కెట్‌లోకి సరిపడా పంట రాకపోవడంతో సీతాఫలం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలోనే సూపర్‌ మార్కెట్‌లో కిలో సీతాఫలానికి రూ. 200లు ధర పలుకుతుండడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. ఒక్కప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకే లభించిన సీతాఫలం ఇప్పుడు అందని ద్రాక్షలా మారుతోందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.సీతాఫలాల లభ్యత తగ్గడానికి కేవలం వాతావరణ పరిస్థితులు మాత్రమే కాదు. అభివృద్ధి పేరుతో చదును చేసి వెంచర్లు వేయడం, కళాశాలలు, భవనాలు నిర్మించడం కూడా సీతాఫలాల ఉత్పత్తికి ఆటంకంగా మారింది. ఇలాగే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో సీతాఫలం లభ్యత మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సరఫరా తగ్గి డిమాండ్‌ పెరగడంతో ప్రస్తుతం మార్కెట్లో సీతాఫలాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక్కో పండు నాణ్యతను బట్టి రూ. 30 నుంచి రూ. 50 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యులు కొనేందుకు ధైర్యం చేయలేకపోతున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save