Global Vaartha
Date of Publish : 03/11/2026, 11:28 am
Editor : భవ్య జర్నలిస్ట్

అర్హుల ఓట్లు తొలగిస్తే సహించం.. ప్రతి ఓటుకూ లెక్క చెప్పాల్సిందే: మంత్రి ఉత్తమ్ కుమార్

హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కుతో చెలగాటమాడే అధికారం ఎవరికీ లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఓటర్ల జాబితా సవరణ చేపడుతూ అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.ఓటు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని, ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ప్రతి పేరుకు సంబంధించి స్పష్టమైన కారణాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఓటర్ల పేర్లను తొలగించడం సరికాదని, బాధితులకు తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు, వివరణ ఇచ్చేందుకు తగిన అవకాశం కల్పించాలని అన్నారు. పొరపాటున తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని, అర్హులైన ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.SIR ప్రక్రియపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం పూర్తి స్పష్టత ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని, ప్రతి చర్యకు సరైన ఆధారాలు ఉండాలని పేర్కొన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడినట్లు తేలితే వాటిని సరిదిద్దే వరకు ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల రక్షణ కోసం ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యత అవసరమని అభిప్రాయపడ్డారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save