Global Vaartha
Date of Publish : 03/11/2026, 12:46 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పీవీ సింధు సహా భారత బ్యాడ్మింటన్ స్టార్లకు తప్పని కష్టాలు.. అసలు ఏమైందంటే?

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ వేదికపై దేశం కోసం పతకాలు సాధిస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్లకు ఊహించని పరిస్థితి ఎదురైంది. యూరప్ పర్యటనలో ఆటగాళ్ల ప్రయాణం, ఆహారం, వసతి ఖర్చుల కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) నిధులు విడుదల చేయకపోవడంతో పలువురు షట్లర్లు సొంత డబ్బులతో టోర్నీల్లో పాల్గొనాల్సి వచ్చింది. పీవీ సింధు, లక్ష్యసేన్ సహా పలువురు ప్లేయర్లు నాలుగు టోర్నీల యూరప్ పర్యటనలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ అద్భుత ప్రదర్శనలతో టైటిళ్లు సాధించి సత్తాచాటారు.

ఫిన్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీల్లో జరిగిన నాలుగు టోర్నీలకు భారత బ్యాడ్మింటన్ బృందం హాజరైంది. అయితే ఈ పర్యటనకు సంబంధించి SAI నిధులు విడుదల చేయలేదు. అక్టోబర్ 6న ఫిన్లాండ్‌లోని వాంటాలో ప్రారంభమైన ఆర్కిటిక్ ఓపెన్‌కు కొద్ది రోజుల ముందే ఈ విషయాన్ని ప్లేయర్లకు తెలియజేసినట్లు సమాచారం. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు కూడా తగిన సమయం లేకుండా పోయింది. ఒలింపిక్ పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా ఈ పరిణామంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన ఆమె.. కొన్ని ఖర్చులను సొంతంగా భరించాల్సి వచ్చిందని తెలిపింది. నిధుల రాలేదని టోర్నీలో పాల్గొనకుండా ఉండలేం కదా అని వెల్లడించింది.

నిధులు ఎందుకు నిలిపేశారంటే..

ఆసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడమే నిధుల నిలిపివేతకు కారణమనే ప్రచారం జరిగింది. ఐచి-నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ వ్యక్తిగత బ్యాడ్మింటన్ విభాగంలో ఒక్క పతకం కూడా సాధించలేదు. 2014 తర్వాత వ్యక్తిగత విభాగంలో పతకం లేకుండా భారత్ తిరిగిరావడం ఇదే తొలిసారి. అయితే ఆసియా క్రీడల ఫలితాలకు నిధుల నిలిపివేతకు ఎలాంటి సంబంధం లేదని SAI ఉన్నతాధికారి స్పష్టం చేసినట్లు సమాచారం. BAI నిర్ణీత గడువులోగా అవసరమైన ప్రతిపాదనలు సమర్పించకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రాబోయే టోర్నీలకు సంబంధించి నిధుల విడుదలను తిరిగి ప్రారంభించినట్లు SAI తెలిపినట్లు సమాచారం. అయితే యూరప్ పర్యటనలో ప్లేయర్లు ఇప్పటికే సొంతంగా చేసిన ఖర్చులను తిరిగి చెల్లించే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save