Global Vaartha
Date of Publish : 03/11/2026, 2:07 pm
Editor : భవ్య జర్నలిస్ట్

తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. వర్షపాతం లోటు తగ్గిందన్న అధికారులు

అమరావతి : రాష్ట్రంలో మురసు తుఫాన్ ప్రభావంపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం, గాలుల తీవ్రత తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమాచారాన్ని విశ్లేషించి దానికి అనుగుణంగా వ్యవస్థలను సమర్థంగా నిర్వహించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అంశంలోనూ డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ జరగాలని సూచించారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కృష్ణ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యాయని అధికారులు వివరించారు. నిన్నటి నుంచి రాష్ట్రమంతటా 20.38 సెం.మీ సగటు వర్షపాతం నమోదు కాగా, బాపట్ల జిల్లాలో 21 సెం.మీ, ప్రకాశం జిల్లాలో 20 సెం.మీ మేర వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం వరకు బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. తుఫాన్‌ కారణంగా కురిసిన వర్షాల వల్ల వర్షపాతం సగటు లోటు 53 నుంచి 28.9 శాతానికి తగ్గిందని అధికారులు తెలియజేశారు. నిన్న ఉదయం నుంచి ఈరోజు వరకు 24 గంటల్లో 2 శాతం వర్షపాతం లోటు తగ్గగా... వచ్చే 5 రోజుల్లో కురిసే వర్షాలతో మరో 2 శాతం లోటు తగ్గుతుందని వెల్లడించారు. ఒక్క రోజులో 0.45 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరగ్గా... 20 టీఎంసీల నుంచి 30 టీఎంసీల మేర భూగర్భ జలాలు రీఛార్జి అయ్యే అవకాశం ఉందన్నారు.

చెరువులు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు 10 టీఎంసీల వరకూ నీరు చేరి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 7 నుంచి 8 టీఎంసీల వరకు నీరు రిజర్వాయర్లకు చేరిందని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయటం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడగలిగామని... తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి సహకారం కోరామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్టీజీఎస్‌లో సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్, ఆర్టీజీఎస్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save