ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వన్డే ప్రపంచ కప్ 2027లో ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. 34 వేల సీట్లకు ఏకంగా 84 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అక్టోబర్ 10న సౌతాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే.భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్ల కోసం ఇప్పటివరకు 83,97,294 అభ్యర్థనలు వచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది. అంటే స్టేడియం సామర్థ్యానికి మించి వందల రెట్లు ఎక్కువ మంది అభిమానులు టికెట్ల కోసం ఆసక్తి చూపిస్తున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు కూడా అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. నవంబర్ 21న అదే వాండరర్స్ స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం ఇప్పటివరకు 79,00,944 అభ్యర్థనలు వచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది. భారత్-పాక్ మ్యాచ్ తర్వాత అత్యధిక డిమాండ్ ఉన్న మ్యాచ్‌గా ఫైనల్ నిలిచింది.
193 దేశాల నుంచి 12 కోట్లకు పైగా దరఖాస్తులు!
మొత్తం టోర్నీ టికెట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భారీగా స్పందిస్తున్నారు. 193 దేశాల నుంచి 2.8 మిలియన్ల మంది అభిమానులు టికెట్ల కోసం నమోదు చేసుకున్నారు. మొత్తం 12 కోట్లకు పైగా టికెట్ అభ్యర్థనలు వచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది. ఆతిథ్య దేశమైన దక్షిణాఫ్రికాలో జరిగే మ్యాచ్‌లకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎనిమిది వేదికల్లో జరగనున్న 41 మ్యాచ్‌లకు సంబంధించి 10.5 కోట్లకు పైగా టికెట్ అభ్యర్థనలు వచ్చాయి. ఇందులో దక్షిణాఫ్రికా ఆడే మ్యాచ్‌లకే దాదాపు 2.6 కోట్ల అభ్యర్థనలు రావడం విశేషం. 2026 నవంబర్ 21 వరకు ఐసీసీ అధికారిక టికెటింగ్ వెబ్‌సైట్‌లో అభిమానులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిమాండ్‌కు మించి దరఖాస్తులు వచ్చిన మ్యాచ్‌లకు లాటరీ విధానంలో టికెట్లను ఎంపిక చేసిన అభిమానులకు కేటాయించనున్నారు.