అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO) ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల హాస్టల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా PDSO విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి యు. జానకి మాట్లాడుతూ పాఠశాలలో హేమంత్ అనే వ్యక్తి విద్యుత్ రంపంతో పదో తరగతి విద్యార్థినిపై దాడి చేయడంతో పాటు, ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినిపై కూడా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గాయపడిన ఇద్దరు విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళలను కించపరిచే సంస్కృతి, పురుషాధిక్య భావజాలం, హింసను ప్రోత్సహించే సినిమాలు, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలు మహిళలపై హింసకు దోహదం చేస్తున్నాయని అన్నారు. మహిళలను కించపరిచే, హింసను ప్రేరేపించే సినిమాలు, వెబ్‌సిరీస్‌ల కంటెంట్‌పై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు మద్యం, మత్తు పదార్థాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, విద్యార్థినులపై వేధింపులను అరికట్టేందుకు సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమాలలో తులసి, పూజిత, సత్య, సాత్విక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.