Global Vaartha
Date of Publish : 03/11/2026, 2:22 pm
Editor : భవ్య జర్నలిస్ట్

తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి: ఎమ్మెల్యే కూనంనేని

ఖమ్మం : జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోయి బీడు భూములుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలని.. కరువు ప్రభావిత ప్రాంతాలకు వెంటనే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంటలకు, బీడు భూములకు పంట నష్టపరిహారం అందించాలని కోరారు. వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు, పత్తి, మిర్చి తదితర పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ కూలీలకు రూ.10 వేల కరువు భత్యం అందించాలని, రేషన్ బియ్యంతో పాటు 16 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని సూచించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు సమస్యపై దృష్టి సారించకుండా ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నాయని కూనంనేని విమర్శించారు. రైతులు పంటలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వాలు రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ రాష్ట్రానికి రూ.25 వేల కోట్ల కరువు సహాయ నిధిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పర్యటనలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు, జిల్లా నాయకులు దొండపాటి రమేష్, ఎర్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save