Global Vaartha
Date of Publish : 03/11/2026, 3:43 pm
Editor : భవ్య జర్నలిస్ట్

రూ.21,800 కోట్ల మెట్రో పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం

పుణె : మహారాష్ట్రలోని పుణె మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన రూ.21,800 కోట్ల విలువైన పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. పుణె మెట్రో మూడో లైన్‌ (పింక్ లైన్‌)ను మోదీ ఇవాళ వర్చువల్‌గా ప్రారంభించారు. దాదాపు 23 కిలోమీటర్ల పొడవైన ఈ మెట్రో మార్గం ద్వారా నగరంలోని ప్రముఖ ఐటీ హబ్ హింజేవాడి నుంచి శివాజీనగర్ వరకు మెట్రో కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. రూ.8,300 కోట్లకు పైగా వ్యయంతో దీనిని నిర్మించారు. కాగా, మాన్ నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు మెట్రో స్టేషన్ వరకు ఈ కారిడార్ విస్తరించి ఉంది. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, నిత్యం కార్యాలయాలకు వెళ్లే ప్రయాణికులకు ఉపయోగపడనుంది.అలాగే, రోడ్డు మార్గంలో ప్రయాణించే వారిపై ఒత్తిడి తగ్గించడంతో పాటు ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మెట్రో లైన్‌లో మరో ప్రత్యేకత కూడా ఉంది. రైళ్లను పూర్తిగా మహిళా రైలు ఆపరేటర్లే నిర్వహించనున్నారు. ఈ మార్గానికి అవసరమైన విద్యుత్‌లో సుమారు 30 శాతాన్ని సౌర విద్యుత్ ద్వారా సమకూర్చాలని ప్రణాళిక రూపొందించారు. ఇదే కార్యక్రమంలో పుణె మెట్రో రెండో దశ విస్తరణ పనులకూ ప్రధాని శంకుస్థాపన చేశారు. సుమారు రూ.13,500 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు కొత్త మెట్రో కారిడార్లను నిర్మించనున్నారు. ఇందులో 2A, 2B, 4, 4A మార్గాలు ఉన్నాయి.

ఈ విస్తరణలో భాగంగా వనాజ్ నుంచి చాందినీ చౌక్, రామ్‌వాడి నుంచి విత్తల్‌వాడి, ఖరాడి నుంచి ఖడక్‌వాస్లా, నాల్స్‌టాప్ నుంచి మాణిక్‌బాగ్ ప్రాంతాలను మెట్రోతో అనుసంధానించనున్నారు. దీంతో ఖరాడి, మగర్‌పట్టా, హడప్సర్, స్వార్గేట్, వార్జే, పుణె కంటోన్మెంట్ వంటి ప్రాంతాలకు మెట్రో సేవలు విస్తరించే అవకాశం ఉంది. కొత్త మార్గాలను ఇప్పటికే ఉన్న మెట్రో నెట్‌వర్క్‌తో పాటు అంతర్‌నగర బస్సు సేవలకు అనుసంధానించనున్నారు. ఇందుకోసం స్వార్గేట్, నాల్స్‌టాప్, ఖరాడి బైపాస్ వద్ద ఇంటర్‌చేంజ్ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా పుణె మెట్రో మూడో లైన్ ప్రారంభం, రెండో దశలో నాలుగు కొత్త కారిడార్లకు శంకుస్థాపనతో నగర ప్రజా రవాణా వ్యవస్థ మరింత విస్తరించనుంది

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save