ఆదోని మున్సిపల్ పీఠంపై స్వతంత్ర అభ్యర్థి స్వప్న జయకేతనం
సుమారు 4 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం
జనసేన రెబల్‌గా బరిలోకి.. చివరి నిమిషంలో చేజారిన చైర్మన్ పీఠం
టీడీపీ, వైసీపీ అంచనాలు తలకిందులు
గ్లోబల్ వార్త - కర్నూలు : ఆదోని మున్సిపల్ ఎన్నికల ఫలితం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ స్వతంత్ర అభ్యర్థి స్వప్న నాయకర్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. సుమారు నాలుగు వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి తన సత్తా చాటారు. జనసేన రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె స్వతంత్రంగా పోటీ చేసి విజయాన్ని అందుకోవడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మల్లప్ప నాయకర్ సతీమణి అయిన స్వప్న నాయకర్ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. టీడీపీ, వైసీపీ వర్గాలు వేసుకున్న రాజకీయ అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె విజయం సాధించారు. ముఖ్యంగా ఆదోనిలో టీడీపీకి ఉన్న పట్టును సవాల్ చేస్తూ స్వతంత్ర అభ్యర్థి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన రెబల్‌గా స్వప్న నాయకర్ ఎన్నికల బరిలో నిలవడంతో ఆ పార్టీకి చైర్మన్ పీఠం దక్కే అవకాశాలు ఉన్నాయనే చర్చ సాగింది. అయితే స్వతంత్ర అభ్యర్థిగా ఆమె విజయం సాధించడంతో జనసేనకు చివరి నిమిషంలో చైర్మన్ సీటు చేజారినట్లయింది. మరోవైపు టీడీపీ, వైసీపీ శిబిరాలు కూడా ఈ ఫలితంతో అనూహ్య పరిస్థితిని ఎదుర్కొన్నాయి. స్వప్న నాయకర్ విజయం వెనుక భారీ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగిందనే చర్చ స్థానిక రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలకు చెందిన ఓటర్లు, స్థానిక రాజకీయ సమీకరణాలు ఈ ఫలితాన్ని ప్రభావితం చేశాయా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఏదేమైనా ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించడం ప్రధాన పార్టీలకు గట్టి రాజకీయ సంకేతంగా మారింది.