Global Vaartha
Date of Publish : 03/11/2026, 5:13 pm
Editor : భవ్య జర్నలిస్ట్

బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కార్‌పై కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Congress MP Chamala Kiran Kumar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి బలం ఉన్న చోటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు ‘సర్‌’ను ఆయుధంగా బీజేపీ వాడుతోందని మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో తెలంగాణకు వాళ్లు చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే చెబుతారని అనుకున్నామని.. కానీ ఆయన కేవలం విమర్శలకు పరిమితం అయ్యారని ఆగ్రహించారు.

అమిత్ షా హైదరాబాద్ సభను మణిపూర్‌లో పెట్టాల్సింది..

అమిత్ షా హైదరాబాద్ సభను మణిపూర్‌లో పెట్టాల్సిందని ఎంపీ చామల అన్నారు. మణిపూర్ భగ్గుమంటోందని.. ముందు కేంద్రం ఆ సంగతి చూడాలని హితవు పలికారు. దేశంలో ఇంతమంది విద్రోహ శక్తులు ఉంటే 2014 నుంచి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. 3 కోట్ల మంది విదేశీ శక్తులు ఈ దేశంలో ఉంటె కేంద్ర హోం శాఖ ఏం చేస్తోందని నిలదీశారు. దేశంలో ప్రతిపక్షాలకు విలువే లేదని అన్నారు. పార్లమెంట్ ఎలా నడపాలో మాక్ పార్లమెంట్‌లో తాము చూపించామని తెలిపారు.

పార్లమెంట్ స్పెషల్ సెషన్ పెట్టాలి..

కేంద్ర ఎలక్షన్ కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌ను ఏకపక్షంగా కొనసాగించాల్సిన అవసరం మోదీ ప్రభుత్వానికి ఏముందని ఎంపీ చామల ప్రశ్నల వర్షం కురిపించారు. పార్లమెంట్ స్పెషల్ సెషన్ పెట్టాలని.. జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని బీజేపీ నేతలు అంటున్నారని.... తాము తలుచుకుంటే 2 సీట్లు ఉన్న కమలం పార్టీ ఈ స్థాయికి వచ్చేదా అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save